జిల్లాల పునర్విభజనతో మన్య ప్రాంతానికి అన్యాయం - వైసిపి పంచాయితిరాజ్ శాఖ కార్యదర్శి శ్రీరాములు, మండల యువ నాయకులు యోసేపు

జిల్లాల పునర్విభజనతో మన్య ప్రాంతానికి అన్యాయం 
వైసిపి పంచాయితిరాజ్ శాఖ కార్యదర్శి శ్రీరాములు, మండల యువ నాయకులు యోసేపు 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 12 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): జిల్లాల పునర్విభజన వలన మన్య ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని వైసిపి పంచాయితిరాజ్ శాఖ కార్యదర్శి సాగిన శ్రీరాములు, చింతపల్లి మండల యువ నాయకుడు పసుపులేటి యోసేపు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన మరలా జరగనుందని జరుగుతున్న ప్రచారంపై వారు స్పందించారు. మరో మారు జరగనున్న జిల్లాల పునర్విభజన వలన గిరిజన ప్రాంత ప్రజలకు నష్టమే తప్ప లాభమేమి లేదని అభిప్రాయపడ్డారు. కొంతమంది గిరిజనులు గిరిజనేతరులకు బినామీలుగా వ్యవహరించడం వలన పటిష్టమైన 1/70 చట్టం కూడా నీరుగారిపోయిందని అన్నారు. మన్యంలో గిరిజనేతరుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతుందని దాని వలన ఈ ప్రాంతం తన ఉనికి కోల్పోయిందని, తద్వారా గిరిజనేతరులకు ఈ ప్రాంతంలో వార్డు మెంబర్లు, ఎంపిటిసి, జడ్పీటిసిలుగా పోటీ చేసే అవకాశం కలిగిందని అన్నారు. అటువంటి తరుణంలో గిరిజన ప్రాంతాల ఉనికిని, గిరిజన చట్టాలను కాపాడేందుకు వైసిపి నేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏజన్సీ ప్రాంతాలన్నిటినీ ఒక తాటిపై తెచ్చి ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు చేస్తే! ఇప్పుడు కూటమి ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పేరిట మైదాన ప్రాంతాలకు చెందిన కొన్ని నియోజక వర్గాలను మన్య ప్రాంతంలో కలిపేందుకు చూస్తుందని అన్నారు. దీని వెనుక కుటిల బుద్ధి దాగి ఉందేమోననే అనుమానం వ్యక్తం చేశారు. అదే నిజమైతే రేపు నియోజకవర్గాల విభజన సమయంలో ఎస్టీ నియోజకవర్గాలను తగ్గించి క్రమ క్రమంగా ఎస్టీ రిజర్వేషన్ ను ఎత్తేసినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని అన్నారు. అందుకనే రాజకీయాలకు అతీతంగా గిరిజన మేధావులు, రాజకీయ నాయకులు గిరిజన ప్రజలు ఈ చర్యలపై గళం విప్పాలని వారు కోరారు. లేకుంటే గిరిజనుల మనుగడ ప్రమాదంలో పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments