అక్క తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి
బలమైన బంధాన్ని, ప్రేమను చాటిచెప్పే పండుగ
తమ్ముళ్లకు రాఖీ కట్టి ప్రేమానురాగాలు పంచిన చిన్నారులు నందిని, మేఘన, హర్షిత.
అల్లూరి జిల్లా, చింతపల్లి, ఆగస్టు 9 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) :
అక్క తమ్ముళ్ల, మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసే రాఖీ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ళ స్వచ్ఛమైన ప్రేమానుబంధానికి ప్రతీకగా తరతరాలుగా కొనసాగుతున్న ఒక అద్భుతమైన సంప్రదాయం. కడశిల్ప గ్రామానికి చెందిన పాత్రికేయుడు గోపినాయక ప్రశాంత్, జానకి దంపతుల చిన్నారులు నందిని, మేఘన , హర్షిత లు నేడు వారి తమ్ముళ్లకు రక్షాబంధన్ (రాఖీ) కట్టి, వారికి విజయం, సంతోషం కలగాలని కోరారు. తమ్ముళ్లు కూడా తమ అక్కలకు రక్షణగా ఉంటామనీ వారికి భరోసా ఇచ్చారు. ఇలాంటి దృశ్యం ప్రతి కుటుంబంలో ఎనలేని ప్రేమానురాగాలను అందిస్తుందనడంలో సందేహం లేదు. ఈ రాఖీ దారం కేవలం దారం కాదు, అది వారి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం, అప్యాయతకు ప్రతీక. ఈ ఏడాది కూడా రాఖీ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఎంతో సంతోషంగా జరుపుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులు, సోదరీమణులు సైతం ఈ పండుగ కోసం తమ సొంత ఊర్లకు చేరుకుని ఆనందంగా గడిపారు. బయట ఉన్న అన్న తమ్ముళ్లకు వీడియో కాల్స్ ద్వారా రాఖీ కట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ పండుగ సందర్భంగా సోదరీమణులకు సోదరులు బహుమతులు, డబ్బులు ఇచ్చి తమ ప్రేమను చాటుకున్నారు. రాఖీ పౌర్ణమి పండుగ కేవలం రక్షాబంధన్‌కే పరిమితం కాకుండా, ఒకరినొకరు కలుసుకోవడానికి, సంతోషాలను పంచుకోవడానికి ఒక గొప్ప అవకాశంగా నిలుస్తుంది. నగరాల్లోనూ, పల్లెల్లోనూ అన్ని ప్రాంతాల్లో ఈ పండుగ సందడి నెలకొంది. ఈ పండుగ సోదరుడు, సోదరి బంధాన్ని మరింత దృఢంగా మార్చి, కుటుంబ విలువలను పెంచుతుందని వారు అభిప్రాయపడ్డారు.
0 Comments