మేధో సంపత్తి హక్కుల పరిరక్షణలో గ్రంథాలయాలది కీలక పాత్ర
కళాశాల గ్రంథాలయ అధికారి టి. జగత్‌రాయ్
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 19(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాదని, మేధో సంపత్తి హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రంథాలయ అధికారి తాంగుల. జగత్‌రాయ్ అన్నారు. చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న మేధో సంపత్తి హక్కులపై జాతీయ సెమినార్ కార్యక్రమంలో ఆయన గ్రంథాలయాల పాత్రపై ఆయన అభిప్రాయాలు, పరిశోధనను పేపర్ ప్రజెంటేషన్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా అందులో కొన్ని అంశాలను ఆయన వివరించారు. వాటిలో డిజిటల్ యుగంలో కాపీరైట్ చట్టాన్ని పరిరక్షించడంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. గ్రంథాలయాలు కేవలం జ్ఞానాన్ని పంచడమే కాకుండా, నైతిక, చట్టబద్ధమైన సమాచార వినియోగానికి కూడా మార్గనిర్దేశం చేస్తున్నాయని అన్నారు. ఈ ప్రక్రియలో కొన్ని సవాళ్లు ఉన్నాయని జగత్‌రాయ్ వివరించారు. గ్రంథాలయ ఉద్యోగులు, వినియోగదారులకు కాపీరైట్ చట్టంపై పూర్తి అవగాహన లేకపోవడం, పుస్తకాలు, వ్యాసాలను స్కాన్ చేసి ఇతరులతో పంచుకోవడం వంటి డిజిటల్ పైరసీ పెరిగిపోవడం ప్రధాన సవాళ్లుగా ఆయన గుర్తించారు. అలాగే, నిధుల కొరత కారణంగా అవసరమైన డిజిటల్ వనరులు, సాఫ్ట్‌వేర్ లైసెన్సులను కొనుగోలు చేయలేకపోవడం, డిజిటల్ రైట్స్ మేనేజ్‌మెంట్ వంటి సాంకేతిక సాధనాల వినియోగం తక్కువగా ఉండటం కూడా ఈ సమస్యకు కారణమవుతున్నాయని ఆయన అన్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ గ్రంథాలయంలో కొత్త విద్యార్థులకు కాపీరైట్ చట్టాలపై అవగాహన కల్పించే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ముఖ్యమని తెలిపారు. గ్రంథాలయ ఉద్యోగులకు, విద్యార్థులకు కాపీరైట్ చట్టాలపై తప్పనిసరి శిక్షణ ఇవ్వాలని అన్నారు. గ్రంథాలయాల్లో ఈ చట్టాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కాపీరైట్ అధికారులను నియమించాలని, అలాగే గ్రంథాలయాల్లో కాపీరైట్ నియమాలను స్పష్టంగా ప్రదర్శించాలని ఆయన సూచించారు. వాటర్‌మార్కింగ్ మరియు లైసెన్స్‌డ్ కంటెంట్ వినియోగాన్ని ప్రోత్సహించాలని, రాష్ట్ర స్థాయిలో ఐపిఆర్ నిపుణులతో కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. చివరగా, గ్రంథాలయాలు భవిష్యత్తులో కేవలం సమాచార కేంద్రాలుగా కాకుండా, చట్టబద్ధమైన జ్ఞాన పరిరక్షకులుగా అభివృద్ధి చెందాలని జగత్‌రాయ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సెమినార్కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన న్యాయవాది వై బాబ్జి, కళాశాల ప్రిన్సిపల్ ఎం విజయభారతి మేదో సంపత్తిలో గ్రంథాలయాల పాత్రపై జగత్ రాయ్ అందజేసిన పేపర్ ప్రజెంటేషన్కు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments