అల్లూరి జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - మాజీ మంత్రి, రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
 మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి

అల్లూరి జిల్లా, పాడేరు ఆగస్టు 17 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో, ముఖ్యంగా అరకు మరియు పాడేరు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, తెదేపా అరకు పార్లమెంటు అధ్యక్షులు మరియు గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. వర్షాల కారణంగా జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, లోయలలో ఉన్న గ్రామాలకు జలప్రవాహాలు మరియు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారని ఆయన తెలిపారు. ఈ సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దని ఆయన సూచించారు. వర్షాలు పడుతున్నప్పుడు పొంగిపొర్లే వాగులు, వంతెనలను దాటవద్దని, అలాగే విద్యుత్ తీగలు, పెద్ద చెట్ల దగ్గరగా వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలంతా అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు. ప్రజల భద్రత కోసం జిల్లా యంత్రాంగం మరియు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని ఆయన తెలియజేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా స్థానిక అధికారులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments