అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి

అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లో సౌకర్యాల లేమి 
అప్గ్రేడ్ అయిన చౌడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
తరగతి గదుల కొరతతో విద్యార్థుల అవస్థలు

కొత్త తరగతి గదులను మంజూరు చేయాలని విజ్ఞప్తి

అల్లూరి జిల్లా, చింతపల్లి, ఆగస్టు 6(సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్): అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలం చౌడుపల్లి గ్రామంలోని ఎంపీయుపి పాఠశాల జిల్లా పరిషత్ హై స్కూల్ గా అప్గ్రేడ్ అవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గతంలో మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలగా ఉన్న దీనిని, ఇటీవల జిల్లా పరిషత్ హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేయడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ పాఠశాలలో మొత్తం 232 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, వీరికి అందుబాటులో ఉన్నది కేవలం మూడు తరగతి గదులు మాత్రమే. దీంతో, విద్యార్థులు ఒకే గదిలో రెండు, మూడు తరగతుల విద్యార్థులు కలిసి కూర్చుని పాఠాలు వినాల్సి వస్తోందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్. సూర్యనారాయణ తెలిపారు. ఈ పరిస్థితుల్లో బోధన సరిగా జరగక విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ సమస్యపై వెంటనే ఉన్నతాధికారులు దృష్టి సారించి, కనీసం పది కొత్త తరగతి గదులను మంజూరు చేయాలని ఆయన అధికారులను కోరారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పిస్తేనే, హైస్కూల్ అప్‌గ్రేడ్ ఉద్దేశ్యం నెరవేరుతుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, పాఠశాలలో తరగతి గదుల కొరతను తీర్చి, మెరుగైన విద్యా వసతులు కల్పించాలని, అదేవిధంగా విద్యార్థులకు క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Post a Comment

0 Comments