పాడేరులోని తన కార్యాలయంలో మాట్లాడుతున్న కిడారి శ్రావణ్ కుమార్
తిరుపతిలో దళిత యువకుడిపై దాడిని ఖండించిన మాజీ మంత్రి, జిసీసీ చైర్మన్ శ్రావణ్ కుమార్
అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు ఆగస్టు 8 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, అరకు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుమలలోని భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో వైసీపీ అనుచరులు ఒక దళిత యువకుడిపై చేసిన క్రూరమైన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దౌర్జన్యం మాత్రమే కాదని, ఇది వైసీపీ నాయకత్వం దళిత సమాజంపై చూపిస్తున్న దమనకాండకు నిదర్శనమని ఆయన అన్నారు. తిరుపతిలోని భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కార్యాలయంలో వైసీపీ రౌడీలు ఒక దళిత యువకుడిని బంధించి, స్పృహ కోల్పోయే వరకు కొట్టారని ఆరోపించారు. ఈ దారుణమైన ఘటనను వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తూ బాధితులను భయపెడుతున్నారని ఆయన తెలిపారు. ఈ దారుణం పవిత్రమైన తిరుపతిని అపవిత్రం చేయడమే కాకుండా, సమాజంలో భూమన కరుణాకర్ రెడ్డి రౌడీయిజంతో భయాందోళనలను సృష్టిస్తున్నాడని స్పష్టమైన ఆధారమని ఆయన అన్నారు.
వైసీపీ దళిత వ్యతిరేక పార్టీ
వైసీపీ ఒక దళిత వ్యతిరేక పార్టీ అని శ్రావణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు దళితులపై దమనకాండ కొనసాగించారని, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అదే తీరును కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ పాలనలో మాస్క్ అడిగిన ఒక డాక్టర్‌ను ఆ పార్టీ అధినేత పొట్టనబెట్టుకున్నారని, ఒకరు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే, మరొకరు గుండు కొట్టించారని ఆయన గుర్తుచేశారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారి రౌడీయిజం, అక్రమాలను సహించే ప్రసక్తే లేదని, కూటమి ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదని, న్యాయం జరిగేలా కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడటానికి, సమాజంలో శాంతిభద్రతలను నెలకొల్పడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కిరాతకానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, న్యాయం జరిగేలా చూస్తామని కిడారి శ్రావణ్ కుమార్ వెల్లడించారు.
0 Comments