చింతపల్లి డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కులపై జాతీయ సెమినార్ ప్రారంభం__కళాశాల ప్రిన్సిపాల్ డా.. ఎం విజయభారతి

చింతపల్లి డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కులపై జాతీయ సెమినార్ ప్రారంభం
కళాశాల ప్రిన్సిపాల్ డా.. ఎం విజయభారతి 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 18 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేధో సంపత్తి హక్కులు (ఇంటెల్లెక్చువల్  ప్రాపర్టీ రైట్స్), ఆవిష్కరణలు మరియు సృజనాత్మకత అనే అంశాలపై రెండు రోజుల జాతీయ సెమినార్ ఘనంగా ప్రారంభమైంది. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఈనెల 18 మరియు 19వ తేదీలలో (సోమ, మంగళవారం) జరుగుతుంది. ఈ సెమినార్ మొదటి రోజైన సోమవారం నాడు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాది వై. బాబ్జి ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఆయన మేధో సంపత్తి హక్కుల గురించి వివరంగా వివరించారు. పేటెంట్లు, కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు మరియు వాణిజ్య రహస్యాలు వంటి వివిధ రకాల మేధో సంపత్తి రక్షణల ప్రాముఖ్యతను ఆయన అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. మేధో సంపత్తి (ఐపి) అనేది మానవ మేధస్సు యొక్క అదృశ్య సృష్టిని కలిగి ఉన్న ఒక ఆస్తి వర్గమని, ఇది చట్టపరమైన వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీ బోటనీ ప్రొఫెసర్ డాక్టర్ బోడయ్య పడాల్ మాట్లాడుతూ, విద్యార్థులు మేధో సంపత్తి హక్కులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. మేధో సంపత్తి అనేది ఒక వ్యక్తి లేదా సంస్థ యొక్క మేధోపరమైన కృషి వల్ల ఏర్పడిన సృష్టి అని, దానిని చట్టపరంగా రక్షించడం కోసం ఈ హక్కులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు.
కార్యక్రమానికి ముందుగా ప్రార్థనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులు కరాటే, ధిమ్సా, క్లాసికల్ డ్యాన్స్‌ లతో  అలరించారు.  విద్యార్థులు ఈ సెమినార్‌ను సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు 56 సెమినార్ పత్రాలను సమర్పించగా దేశవ్యాప్తంగా ఔత్సాహిక పేపర్ ప్రజంటర్లు తమ పత్రాలను సమర్పించడం ఒక విశేషమన్నారు. ఇలాంటి సెమినార్లు విద్యార్థుల్లో  సృజనాత్మకతను వెలికి తీస్తాయని అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ సెమినార్ విద్యార్థులకు మేధో సంపత్తి హక్కులపై ఒక సమగ్ర అవగాహన కల్పిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మినుముల శ్రీనివాస్ పాత్రుడు, అధ్యాపకులు లీలా పావని, రమణ కేజీయ, సంతోషి, గ్రంథాలయ అధికారి తాంగుల జగత్ రాయ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments