అల్లూరి జిల్లా, కొయ్యూరు ఆగస్టు 7(ఏఎస్ఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : పాడేరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి పనితీరుపై డౌనూరు పంచాయతీ టీడీపీ సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గిడ్డి ఈశ్వరి బంధువులుగా చెప్పుకుంటున్న కొంతమంది నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్టీలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని సీనియర్ నేతలు ఆరోపించారు. డౌనూరు పంచాయతీ టీడీపీ యూనిట్ ఇన్‌ఛార్జ్ లేగుల పుష్పలత, సీనియర్ నాయకులు పొట్టిక నూకరాజు, బూత్ ఇన్‌ఛార్జ్ కాకరి కుమారి, వార్డు మెంబర్ లేగుల లింగమ్మ, కార్యకర్త రాములమ్మలు పార్టీ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డౌనూరులో గిడ్డి ఈశ్వరి బంధువులమని చెప్పుకుంటూ కొందరు నేతలు పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపి, ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న సీనియర్ నాయకులను, కార్యకర్తలను లెక్కచేయడం లేదని వారు తెలిపారు. కేవలం ఫోటోల కోసం మాత్రమే ప్రచారం చేస్తున్నారని, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం, మెటీరియల్స్ ఇతరులకు తెలియకుండా కేవలం ఇద్దరు, ముగ్గురు కార్యకర్తలతో మాత్రమే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శి ఎన్నికల విషయంలో కూడా ఏకపక్ష ధోరణి ప్రదర్శించారని నాయకులు ఆవేదన చెందారు. అధ్యక్ష పదవికి సీనియర్ నాయకులైన పొట్టిక నూకరాజు పేరును అందరూ బలపరిచినప్పటికీ, గిడ్డి ఈశ్వరి బంధువుల ఒత్తిడి కారణంగా డౌనూరు నేతల అనుమతి లేకుండానే తోకల దేవి పేరును ప్రకటించారని తెలిపారు. అడ్డదారిలో కమిటీ పేర్లను పార్టీ అధిష్టానానికి పంపించారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గిడ్డి ఈశ్వరి మౌనంగా ఉండటం పార్టీకి నష్టం కలిగిస్తుందని, స్థానిక ఎన్నికల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇస్తూ, ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న పాత నేతలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులను కూడా పంపిణీ చేయకుండా తమ దగ్గరే పెట్టుకున్నారని, దీనివల్ల పార్టీ బలోపేతం కాకుండా మరింత బలహీనపడుతుందని అన్నారు. ఈ విషయాలను గిడ్డి ఈశ్వరి దృష్టికి తీసుకెళ్లినా ఆమె పట్టించుకోవడం లేదని వాపోయారు. బంధుప్రీతిని పక్కన పెట్టి, పార్టీ కోసం కష్టపడిన అందరినీ కలుపుకుపోతేనే పార్టీ బలోపేతం అవుతుందని హితవు పలికారు.
0 Comments