ప్రత్యేక జీవో ఇచ్చిన తర్వాతే మెగా డీఎస్సీ నియామకాలు చేపట్టాలి

ప్రత్యేక జీవో ఇచ్చిన తర్వాతే మెగా డీఎస్సీ నియామకాలు చేపట్టాలి
గిరిజన నిరుద్యోగుల సంఘం డిమాండ్

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 16(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 9 ఆదివాసి దినోత్సవం నాడు ఆదివాసి నిరుద్యోగులకు 5(2) ప్రకారం ప్రత్యేక జీవోను తీసుకొస్తామని హామీ ఇచ్చారని, అది తెచ్చిన తరువాతే మెగా డీఎస్సీ నియామకాలు చేపట్టాలని గిరిజన నిరుద్యోగుల జిల్లా కన్వీనర్ సాగిన సత్యనారాయణ అన్నారు. శనివారం మెగా డీఎస్సీ సాధన సమితి నాయకులు ముర్ల విష్ణుమూర్తి, టి.రవి, డి.రాజు లతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ 2025 గిరిజన నిరుద్యోగులకు శాపంగా మారిందని, గిరిజన ప్రాంతానికి కేటాయించిన 470 ఉపాధ్యాయ పోస్టుల్లో జీవో నెంబర్–3 అమలులో లేకపోవడంతో కేవలం 100 ఉద్యోగులకు ఆరుగురికే అవకాశం లభించడం గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయమన్నారు. ఆగస్టు 9న పాడేరు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజనులకు 100 శాతం ఉద్యోగావకాశాలు కల్పించే ప్రత్యామ్నాయ జీవో విడుదల చేస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు అమలు చేయకపోవడం దారుణమని వారు మండిపడ్డారు. దీనివల్ల ఏజెన్సీ ప్రాంత గిరిజన అభ్యర్థులు ఉద్యోగావకాశాలను కోల్పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ జీవో విడుదల చేసి, మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలను గిరిజన ప్రాంతాల్లో అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐటీడీఏలు గిరిజనుల మేలు కోసం కాకుండా ప్రభుత్వాలపై ఆధారపడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు చేస్తూ, గిరిజన నిరుద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని వాపోయారు. గిరిజనుల ఉపాధి హక్కులను కాపాడటం ప్రభుత్వ ధర్మమని, ఆలస్యం చేయకుండా ప్రత్యామ్నాయ జీవో ప్రకటించి నియామక ప్రక్రియను ప్రారంభించాలని గిరిజన నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Post a Comment

0 Comments