ప్రపంచ ఆదివాసి దినోత్సవ వారోత్సవాలను జయప్రదం చేయండి
గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 7(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : మండలంలో నిర్వహిస్తున్న ప్రపంచ ఆదివాసి దినోత్సవ వారోత్సవాలను గిరిజనులంతా జయప్రదం చేయాలని గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి అన్నారు. గురువారం అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వారోత్సవాలలో భాగంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో చింతపల్లి మండలంలోని చౌడుపల్లి పంచాయతీ పినకొత్తూరు గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి మాట్లాడుతూ, ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ నియామకాల్లో 100% రిజర్వేషన్ కల్పించే దిశగా ప్రత్యేక జీవోను ప్రకటించాలని ఆయన కోరారు. గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసిన జీవో నంబర్ 3 స్థానంలో, 100% రిజర్వేషన్ చట్టాన్ని తీసుకువచ్చి, దానిని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో నంబర్ 3 అమల్లో ఉన్నప్పుడు ఆదివాసులు 19 శాఖల్లో 35 రకాల ఉద్యోగాలను హక్కుగా పొందే వారనీ, అది రద్దు అయిన తర్వాత ఆ అవకాశాలు లేకుండా పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లో కేవలం 6% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఆదివాసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఐటీడీఏ పరిధిలో మొత్తం 766 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే, ఆదివాసీలకు దక్కేది కేవలం 42 పోస్టులేనని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 94% నివాసం ఉన్న ఆదివాసీలకు 6% పోస్టులు, 6% నివాసం ఉన్న గిరిజనేతరులకు 94% పోస్టులు దక్కడం దారుణమని ఆయన ఖండించారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీ ప్రకారం ఏజెన్సీలో 100% ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నట్లు ఇటీవల ప్రకటించినప్పటికీ, మెగా డీఎస్సీలో మాత్రం 6% రిజర్వేషన్ అమలు చేయడం ఆదివాసులకు చేస్తున్న అన్యాయమని మండిపడ్డారు. అందువల్ల, మెగా డీఎస్సీ నుండి ఆదివాసీ ప్రాంత పోస్టులను మినహాయించి, ఏజెన్సీ షెడ్యూల్ డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని గిరిజన సంఘం డిమాండ్ చేస్తున్నది. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం కమిటీ సభ్యులు గెమ్మెల లక్ష్మయ్య, సీదేరి మల్లేశ్వరరావు, చిన్నారావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
0 Comments