వాట్సాప్ గవర్నెన్స్ పై అవగాహన కల్పిస్తున్న పంచాయతీ కార్యదర్శి
పంచాయతీ కార్యదర్శి లక్ష్మి కుమార్
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 5(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై అవగాహన ర్యాలీని మంగళవారం చింతపల్లి మండల కేంద్రంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి లక్ష్మి కుమార్ మాట్లాడుతూ, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను, సంక్షేమ పథకాల సమాచారాన్ని ప్రజలకు వేగంగా చేరవేయవచ్చని తెలిపారు. దీనివల్ల ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం తగ్గి, మరింత పారదర్శకమైన పాలన సాధ్యమవుతుందన్నారు. ఈ సేవలతో ప్రజలకు వేగవంతమైన, సులభమైన పరిపాలనా సేవలను సకాలంలో పొందగలరని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రజలకు అవసరమైన వివిధ రకాల ధ్రువపత్రాలను సకాలంలో అందించేందుకు కృషి చేస్తుందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 200కు పైగా సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని వెల్లడించారు. ఈ సేవలను పొందాలంటే 95523 00009 అనే వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయడం ద్వారా యాక్సెస్ చేయవచ్చని, పలు రకాల సేవలను చరవాణి ద్వారా పొందొచ్చని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన ర్యాలీలో పలువురు సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
0 Comments