టూ వీలర్ మెకానిక్ కోర్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి - చింతపల్లి ఎస్సై వెంకటేశ్వరరావు

టూ వీలర్ మెకానిక్ కోర్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోండి
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 45 రోజుల టూ-వీలర్ మెకానిక్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం

ప్రిన్సిపల్ డాక్టర్ ఎం విజయభారతి

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 6(సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్): చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో 45 రోజుల టూ-వీలర్ మెకానిక్ సర్టిఫికెట్ కోర్సును కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. విజయభారతి ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా ప్రారంభించారు. 
విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్ఐ వెంకటేశ్వరరావు 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతపల్లి పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బైక్ నడపడం మాత్రమే కాకుండా, దాని రిపేరింగ్ గురించి కూడా తెలుసుకోవడం ఎంతైనా అవసరమని సూచించారు. బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, తద్వారా ప్రమాదాల నివారణతో పాటు చట్టపరమైన సమస్యలు తలెత్తకుండా ఉంటాయని తెలిపారు. ఈ కోర్సులో భాగంగా, ప్రతిరోజూ ఒక గంట పాటు విద్యార్థులకు స్థానిక అనుభవజ్ఞులైన మెకానిక్ల ద్వారా ప్రయోగాత్మకంగా శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవకాశాలను పెంపొందించేందుకు సర్టిఫికెట్ కూడా అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందే నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చన్నారు. కళాశాలలోని ఎక్కువ మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, కోర్సులో చేరాలని ప్రిన్సిపాల్ డా. విజయభారతి కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ కోఆర్డినేటర్ డా. వి. రమణ, లైబ్రరీయన్ జగత్ రాయ్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments