వంద పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సమన్వయ అధికారిని నీలవేణి
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 20 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చింతపల్లిలో నిర్మాణం జరుగుతున్న ఏరియా ఆసుపత్రి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అల్లూరి జిల్లా ప్రాంతీయ ఆసుపత్రుల సమన్వయ అధికారిణి నీలవేణి అన్నారు. బుధవారం ఆమె స్థానిక వైద్యాధికారిణి రుక్మిణితో కలిసి నిర్మాణ దశలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె గుత్తేదారుడిని పురోగతిపై ప్రశ్నించారు. ఇప్పటికే భవన నిర్మాణం సగానికి పైగా పూర్తయినప్పటికీ, మిగిలిన పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న రోగుల దృష్ట్యా పనులు వేగవంతం చేసి, ఆసుపత్రిని త్వరితగతిన అందుబాటులోకి తెచ్చి వైద్య ఆరోగ్యశాఖకు అప్పగించాలని ఆమె సూచించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజలకు సమయానికి వైద్యసేవలు అందించడం అత్యవసరమన్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే రెండు మండలాల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ అనిల్, ఇంజనీర్ బాలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
0 Comments