టూ స్టాప్ పేరిట చార్జీలు జాస్తి... ప్రయాణం నాస్తి
పల్లె వెలుగులు తొలగించి.. టూ స్టాప్ సర్వీసులు పెంచి ప్రయాణికులను అడ్డగోలుగా దోస్తున్న ఆర్టీసీ
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 11(సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : టూ స్టాప్ పేరుతో ప్రయాణకుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్న నర్సీపట్నం ఏపీఎస్ఆర్టీసీ ఎక్కడపడితే అక్కడ బస్సులు నిలిపి ప్రయాణికులను తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నారు. చింతపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే టూ స్టాప్ ఆర్టీసీ సర్వీస్ కు లోతుగెడ్డ జంక్షన్, లంబసింగి గ్రామాలలో మాత్రమే నిలప వలసిన ఆర్టీసీ సర్వీసును డ్రైవర్లు ఎక్కడపడితే అక్కడ ఆపి ప్రయాణికులకు అసహనం కలిగిస్తున్నారు. చింతపల్లి నర్సీపట్నం ప్రధాన రహదారి అంతంతమాత్రంగా ఉన్న రోజుల్లోనే చింతపల్లి నుంచి బయలుదేరిన టూ స్టాప్ సర్వీస్ లోతుగెడ్డ జంక్షన్, లంబసింగి లలో మాత్రమే రెండు స్టాప్ లుగా నిర్ణయించడంతో గంట 15 నిమిషాలలో నర్సీపట్నం చేరేది. అదేవిధంగా నర్సీపట్నంలో బయలుదేరిన టు స్టాప్ చింతపల్లి చేరేది. కానీ నేడు చింతపల్లి నుంచి లంబసింగి వరకు జాతీయ రహదారి, లంబసింగి కొండ రహదారిలోనూ పూర్తిస్థాయి తారు రోడ్డుగా మలచినప్పటికీ కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ అనేటప్పటికీ ప్రయాణికులకు ఎంతో నమ్మకం. కానీ నేటి పరిస్థితులు అందుకు భిన్నం. చింతపల్లిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఉన్నప్పటికీ ప్రయాణికుల సౌకర్యార్థం కాంప్లెక్స్ వద్ద టిక్కెట్లు కొట్టి బయలుదేర వలసిన టూ స్టాఫ్ ఆర్టీసీ డ్రైవర్లు అందుకు భిన్నంగా ఊరవతల బస్సులు నిలిపి టిక్కెట్లు కొట్టే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దీనివలన ఐదు నిమిషాలు ఆలస్యమైన ప్రయాణికులు ఆ బస్సును అందుకోలేక మరో అరగంట సేపు కాంప్లెక్స్ లలో వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొంది. అదే ఆర్టీసీ సర్వీస్ కాంప్లెక్స్ లోనే ప్రయాణికులకు టిక్కెట్లు కొట్టి బయలుదేరితే ఐదు నిమిషాలు ఆలస్యమైన ప్రయాణికులు ఆ బస్సును అందుకునే వెసులుబాటు ఉంటుందని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నర్సీపట్నంలో బయలుదేరిన 2 స్టాప్ సర్వీసులు కూడా కాంప్లెక్స్ వద్దనే ప్రయాణికులకు టిక్కెట్లు కొట్టి బయలుదేరే విధంగా ఆదేశాలు ఇవ్వాలని ప్రయాణికులు అంటున్నారు. టూ స్టాప్ అని చెప్పి ప్రతి చోట ఆపుతూ గంట 15 నిమిషాల్లో జరగవలసిన ప్రయాణాన్ని రెండు గంటలసేపు చేయడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చార్జీలు జాస్తి... ప్రయాణం జాప్యం అని ప్రయాణికులు అనుకుంటున్నారు. మన్య ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం పల్లె వెలుగు సర్వేసులను అధికంగా తిప్పవలసిన ఆర్టీసీ అధికారులు ఆ విధానాన్ని పక్కన పెట్టి టూ స్టాప్ విధానాన్ని ముందుకు తీసుకువచ్చి ప్రయాణికులకు త్వరగా గమ్యస్థానాన్ని చేరే అలవాటు చేసి నేడు అధిక చార్జీలు వసూలు చేస్తూ ప్రయాణాన్ని భారంగా తయారు చేశారని టూ స్టాప్ ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే సాధారణ సర్వీసులు లేక సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఏటి గైరంపేట, డౌనూరు, తురబాడ, రావిమానుపాకలు, లంబసింగి, చిట్రాలగొప్పు, రాజుపాకలు, జంక్షన్, పెదగడ్డ స్టాపులుగా ఉండేవని, నేడు ఈ స్టాపులు లేకపోవడంతో ఆయా నిర్ణీత స్టాప్ లలో దిగవలసిన ప్రయాణికులు కనీస చార్జీ రూ.50, రూ.30లు చెల్లించి టూ స్టాప్ లలో ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. సాధారణ సర్వీసులు లేక సమీప దూరానికి సైతం అధిక మొత్తంలో చార్జీలు చెల్లించి ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి టూ స్టాప్ సర్వీస్ లను లోతుగెడ్డ జంక్షన్, లంబసింగి లలో మాత్రమే ఆపేటట్లు డ్రైవర్లకు ఆదేశాలు ఇవ్వాలని, లేనిపక్షంలో త్రీ స్టాప్ అని పెట్టి లోతుగెడ్డ జంక్షన్, లంబసింగి, డౌనూరుల లోనూ, ఫోర్ స్టాప్ అని పెట్టి లోతుగెడ్డ జంక్షన్, లంబసింగి, డౌనూరు, ఏటి గైరం పేట లను స్టాప్ లుగా పెట్టి ప్రయాణికులకు చార్జీలలో భారం తగ్గించాలని, అదే క్రమంలో పల్లె వెలుగు సర్వీసులను మన్య ప్రాంతంలో తిప్పాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.
0 Comments