గిరిజన ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో చింతపల్లిలో ఉత్సాహభరితంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు

ఉత్సాహభరితంగా ఆదివాసి దినోత్సవ వేడుకలు
ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా ఆదివాసీ వేడుకలు 
గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ 
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 9: (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) 
గిరిజన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా మండల కేంద్రంలో శనివారం అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవ వేడుకలను గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆదివాసీ చట్టాలు, హక్కులను పరిరక్షించాలని కోరుతూ గిరిజన ఉద్యోగ సంఘాలు, వివిధ ఆదివాసీ సంఘాలు సయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు, గాం గంటము దొర, మల్లు దొర వంటి వారిని స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు నివాళులు అర్పించి, పలువురు పెద్దలు, అతిధుల నడుమ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమాలలో భాగంగా స్థానిక పాఠశాల, కళాశాలల విద్యార్థినీ విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలతో చూపరులను అలరించారు. అలాగే ఆదివాసి సంప్రదాయ వేషధారణలతో డోలు, వాయిద్యాలు, థింసా నృత్యాలు, ఆదివాసీ గేయాలు ఆకట్టుకున్నాయి. ఉత్సాహభరితంగా సాగిన సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం ముఖ్య అతిథులు, పెద్దలు ఆదివాసీ దినోత్సవ ప్రాముఖ్యతపై ప్రసంగించారు. అందులో ప్రధానంగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే, గిరిజనుల భవిష్యత్తుకు జీవనాధారమైన గిరిజన చట్టాలు, హక్కులు కాపాడుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించారు. ప్రస్తుతం ఆదివాసి సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై గిరిజనులంతా గళమెత్తారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, గిరిజన సంఘాల నాయకులు, అతిధులు మాట్లాడుతూ 78 ఏళ్ల స్వాతంత్ర భారతావణిలో నేటికీ అభివృద్ధి చెందనిది ఆదివాసులేనని, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎప్పటికీ ఆమడ దూరంలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నానాటికి నిరుద్యోగులు పెరిగి పోతుంటే మరోపక్క ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి గిరిజన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయని వాపోయారు. 1/70 భూ బదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిన కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా 5వ షెడ్యూల్డ్ ప్రాంతమైన ఆదివాసుల భూములు ఇతరులకు అన్యాక్రాంతం అయిపోతున్నాయని, మరోప్రక్క జీఓ నం.3 రద్దుతో రిజర్వేషన్ను కోల్పోయే స్థితికి వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆదివాసి దినోత్సవం నుండైనా ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా ఆదివాసీల ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరారు. వాటిలో జి.వో నెం:3 కు ప్రత్యామ్నాయంగా మరో జి.వో ఇచ్చి చట్టబద్ధం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ప్రతిపక్షనేతగా నారా చంద్రబాబు నాయుడు అరకు ఎన్నికల సభలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు, అలాగే గిరిజన గురుకులం, కె.జి.బి.వి.లలోని గెస్ట్ ఫ్యాకల్టీలను రెగ్యులర్ చేయాలన్నారు. ఆదివాసీ ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలనీ, 1/70, పెసా, అటవీ హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం చివరలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఆకట్టుకున్న విద్యార్థినులకు జ్ఞాపికలను అతిధుల చేత అందింపజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు పిబివివి ప్రసాద్, జి బోడం నాయుడు, పీజీహెచ్ఎం ఎస్ రామరాజు పడాల్ పాల్గొనగా, కార్యక్రమంలో గిరిజన ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు దేపూరి శశి కుమార్, జిల్లా కార్యదర్శి జి మోహన్ రావు, మండల అధ్యక్షుడు బి గంగారాజు, ప్రధాన కార్యదర్శి కె చందర్రావు, కోశాధికారి జి కామేష్, కార్యదర్శి పి ప్రసాద్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యు.వి గిరి, ఏపీసిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె వెంకటరమణ, గిరిజన జాగృతి సమన్వయ కమిటీ అధ్యక్షులు ముర్ల వెంకటరమణ, మహిళా కార్యదర్శి ఆర్ వెంకట రమణమ్మ, సంయుక్త కార్యదర్శి పి అచ్చిరాజు, ఆయా శాఖల గిరిజన ఉద్యోగులు, గిరిజన పాత్రికేయులు, విద్యార్థినీ విద్యార్థులు, అధిక సంఖ్యలో గిరిజనులు హాజరయ్యారు.

Post a Comment

0 Comments