మన్యంలో డయాలసిస్ కేంద్రాల పరిస్థితిపై మంత్రికి వినతి

మన్యంలో డయాలసిస్ కేంద్రాల పరిస్థితిపై మంత్రికి వినతి
పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్కు వినతి పత్రం అందజేస్తున్న జనసేన నాయకుడు వినయ్

అల్లూరి జిల్లా, చింతపల్లి (సురేష్ కుమార్ స్టాఫ్ రిపోర్టర్) : అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో ఉన్న డయాలసిస్ కేంద్రాలలో సౌకర్యాలను మెరుగుపరచాలని, మూసివేసిన అరకు డయాలసిస్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని జనసేన సీనియర్ నాయకుడు వాడకాని వినయ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కోరారు. మంగళవారం మన్యం పర్యటనలో భాగంగా పాడేరులోని మినుములూరులో ఉన్న మంత్రి మనోహర్‌ను పార్టీ శ్రేణులతో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఆయనను సన్మానించారు. అనంతరం వినయ్ మన్యంలో నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా డయాలసిస్ కేంద్రాలలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సౌకర్యాల లేమి వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ, డయాలసిస్ కేంద్రాలలో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని కోరారు. కొన్ని కేంద్రాలలో అనర్హులైన సిబ్బంది పనిచేయడం వల్ల రోగుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, కొన్ని కేంద్రాలలో పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. అంతేకాకుండా, అరకు డయాలసిస్ కేంద్రం మూతబడటంతో పాడేరు కేంద్రంపై రోగుల తాకిడి పెరిగిందని, దీనివల్ల సరైన సమయంలో చికిత్స అందడం లేదని ఆయన వివరించారు. డయాలసిస్ కేంద్రాలకు సరైన పర్యవేక్షణ లేకపోవడం, మందుల కొరతతో పరిస్థితి మరింత దిగజారిందని వినయ్ పేర్కొన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మంత్రిని కోరారు. దీనికి మంత్రి మనోహర్ సానుకూలంగా స్పందించారని, ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వినయ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు లంకెల విశ్వేశ్వర రావు, శెట్టి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments