జాతీయ సెమినార్ తో చింతపల్లికి ప్రత్యేక గుర్తింపు.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల యాజమాన్యం కృషి అభినందనీయం

•చింతపల్లిలో తొలిసారిగా జరిగిన జాతీయ సెమినార్
•చరిత్ర సృష్టించిన డిగ్రీ కాలేజ్ నిర్వాహకులు
•ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ భారతి ప్రయత్నానికి ప్రశంసలు
 (ఎడిటర్ విఎస్ జే ఆనంద్ ) 
2025 ఆగస్టు 19 
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లికి ఓ ప్రత్యేకత ఉంది. స్వాతంత్ర ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు తో పాటు తన అనుచరులు( గిరిజన ఉద్యమకారులు ) చింతపల్లిని వేదికగా చేసుకుని పోరాటాన్ని కొనసాగించారు. ప్రకృతి అందాలకు నిలయమైన ఆంధ్ర కశ్మీర్ లంబసింగి, చెరువుల వేలం చింతపల్లి లోనే ఉంది. చింతపల్లి కీర్తి, ప్రతిష్టలను బాహ్య ప్రపంచానికి తెలియజేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. తాజాగా ఈనెల 18, 19 తేదీల్లో చింతపల్లి డిగ్రీ కళాశాల యాజమాన్యం తొలిసారిగా జాతీయ సెమినార్ నిర్వహించి చరిత్ర సృష్టించారు. సాధారణంగా జాతీయస్థాయి సెమినార్లు ప్రధాన పట్టణాలు, మెరుగైన సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే జరగడం మనం చూస్తున్నాం. "మేధో సంపత్తి హక్కులు" అనే అంశంపై రెండు రోజులు కళాశాల యాజమాన్యం సెమినార్ నిర్వహించడం, సుదూర ప్రాంతాలకు చెందిన విద్యావంతులు, మేధావులు అతిథులుగా హాజరై అమూల్యమైన విషయాలను ఆదివాసి విద్యార్థులకు వివరించడం గొప్ప విషయం అని చెప్పాలి. మేధో సంపత్తి పై అవగాహన నేటి తరం యువతకు చాలా అవసరం. సాధారణంగా ఇటువంటి అంశాలపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ విశ్వవిద్యాలయాల్లో మాత్రమే సెమినార్లు జరుగుతుంటాయి. కనీస సదుపాయాలు లేకపోయినా, గిరిజన ప్రాంతమైన చింతపల్లిలో జాతీయ సెమినార్ ని విజయవంతంగా నిర్వహించిన ఘనత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయ భారతికే దక్కుతుంది. 
జాతీయ సెమినార్ నిర్వహణకు ప్రిన్సిపల్, కళాశాల యాజమాన్యం రెండు నెలలుగా శ్రమించారు. సెమినార్ లో వక్తలు ప్రసంగాల ను పుస్తకం రూపంలో సిద్ధం చేసే విద్యార్థులకు అందించడం శుభ పరిణామం. డిగ్రీ కళాశాల యాజమాన్యం జాతీయస్థాయి సెమినార్ నిర్వహణతో చింతపల్లి కీర్తి మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. జాతీయస్థాయి సెమినార్ నిర్వహించిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం విజయ భారతిని ప్రముఖులు, ప్రాంతీయులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ "అన్వేషణ అప్డేట్స్" తో మాట్లాడుతూ కళాశాల అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, చింతపల్లి ప్రజలు, విద్యార్థుల సహకారంతోనే జాతీయస్థాయి సెమినార్ ని విజయవంతం చేయగలిగామన్నారు.

Post a Comment

0 Comments