జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం- పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రల పంపిణీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

  • జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం
  • పిల్లలందరికీ అల్బెండజోల్ మాత్రల పంపిణీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

పాడేరు ఆగస్టు 12 (సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు మండలం, ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల (బాలికల) శ్రీకృష్ణాపురంలో మంగళవారం నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తో కలిసి విద్యార్థినీలకు నులిపురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలు వేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పిల్లలలో నులిపురుగులు పోషకాలను శోషించడంలో ఆటంకం కలిగిస్తాయి. దాంతో రక్తహీనత, పోషకాహార లోపం, మానసిక మరియు శారీరక అభివృద్ధి దెబ్బతింటుందని చెప్పారు. నులిపురుగుల ఉధృతి తక్షణ ప్రతికూల ప్రభావాలను చూపకపోయినా, దీర్ఘకాలికంగా మానవ ఆరోగ్యానికి హానికరమని, నిరంతర ఇన్ఫెక్షన్ పిల్లల అభ్యాసం, అభివృద్ధి, మానసిక ఆరోగ్యం, పోషకాహారం పై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. ఈ సమస్యను నివారించడానికి ప్రభుత్వం 2–19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ నులిపురుగులను తొలగించేందుకు జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని ప్రారంభించిందని తెలిపారు.
నులిపురుగులు సోకిన పిల్లలు మరియు కిశోరులు రక్తహీనత, పోషక లోపం, ఆకలి మందగించడం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం వంటి సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. 2–19 సంవత్సరాల మధ్య వయస్సు గల ప్రీ-స్కూల్ మరియు పాఠశాల వయస్సు గల పిల్లలందరికీ (నమోదు చేసిన వారు, చేయని వారు అందరికీ) పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల వేదికగా నులిపురుగులను తొలగించడం ద్వారా వారి మొత్తం ఆరోగ్యం, పోషక స్థితి, విద్యకు ప్రాప్యత మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడమే ఈ దినోత్సవ లక్ష్యం అని తెలిపారు. ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు  పర్యావరణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత విలువపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుచున్నదని తెలిపారు. 
అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. టి. విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ, 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని 3,214 అంగన్‌వాడీ కేంద్రాలు, 3,124  ప్రభుత్వ పాఠశాలలు, 82 ప్రైవేటు పాఠశాలలు, 46 జూనియర్ కళాశాలలు మరియు 16 ఐటీ‌ఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ కళాశాలలు కలిపి 2–19 సంవత్సరాల వయస్సు గల మొత్తం 3,16,754 మంది అర్హులైన చిన్నారులు, విద్యార్థినీ విద్యార్థులు ఉండగా వీరిలో 3,02,816 మందికి ఈరోజు అల్బెండజోల్ మాత్రలను అందించడం జరిగిందని 95.6% శాతం పూర్తైందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,321 టీంలు ఏర్పాటు చేసి, 336 మంది పర్యవేక్షణ సిబ్బందిని నియమించామని అన్నారు. అనివార్య కారణాల వల్ల మాత్రలు తీసుకోని  విద్యార్థినీ, విద్యార్థులకు మాప్-అప్ రౌండ్ ద్వారా 20.08.2025 న మాత్రలు పంపిణీ చేయడం జరుగునని తెలిపారు.
అల్బెండజోల్ మాత్రల వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని, అయితే ఏవైనా సమస్యలు తలెత్తితే సమీప వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. టి. విశ్వేశ్వర నాయుడు, ఆర్.బి.ఎస్.కె జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. ప్రతాప్, పి.హెచ్.సి. వైద్యాధికారి, ప్రోగ్రామ్ మేనేజర్ ఏగిరెడ్డి కిషోర్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments