సచివాలయ భవనం అసంపూర్తిగా నిలవడంతో సచివాలయ సేవలకు దూరమ వుతున్న బూసిపుట్ పంచాయతీ ప్రజలు- సర్పంచ్ కిల్లో రాజమ్మ

అసంపూర్తిగా బూసిపుట్ సచివాలయ భవన నిర్మాణం 
సచివాలయ సేవలు పొందాలంటే 15 కి.మీ. వెళ్లాల్సిందే

సకాలంలో సేవలు అందక పథకాలకు దూరమవుతున్న పంచాయతీ ప్రజలు

సచివాలయ భవన నిర్మాణాన్ని పూర్తిచేయండంటూ సర్పంచ్ రాజమ్మ వేడుకోలు

అల్లూరి జిల్లా, ముంచంగిపుట్ ఆగస్టు 9 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): అల్లూరి జిల్లా ముంచంగిపుట్ మండలంలోని బూసిపుట్ పంచాయతీలో సచివాలయం లేక ప్రజలు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని ఆ పంచాయతీ సర్పంచ్ కిల్లో రాజమ్మ అన్నారు. ప్రభుత్వాలు, అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్న అసంపూర్తిగా నిలిచిన సచివాలయం భవనం నిర్మాణాన్ని పూర్తిచేయండంటూ వేడుకుంటున్నారు. ఈ సందర్భంగా శనివారం పంచాయతీ ప్రజలతో కలిసి స్థానిక పాత్రికేయులకు పత్రిక ప్రకటనను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం అవసరమైన పలు రకాల సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు, సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకు అందించేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, ప్రతీ పంచాయతీ పరిధిలో సచివాలయ భవనాలను నిర్మించి పరిపాలనను సులభతరం చేసిందన్నారు. దురదృష్టవశాత్తు తమ పంచాయతీలో సచివాలయ భవనం మంజూరైనా, గుత్తేదారు, అధికారుల నిర్లక్ష్యంతో నిర్మాణ దశలోనే అర్ధాంతరంగా పనులు నిలిచిపోయాయని, దాంతోపాటు 2024 ఎన్నికలు, కొత్త ప్రభుత్వం రాకతో నిర్మాణం కార్యరూపం దాల్చలేదన్నారు. కొత్త ప్రభుత్వం రాకతో భవన నిర్మాణ పనులు పూర్తవుతాయని భావించినప్పటికీ నిరాశే ఎదురయిందన్నారు. నాటినుంచి తమ పంచాయతీ ప్రజలు సచివాలయ సేవలు పొందేందుకు 15 కి.మీ. దూరంలో ఉన్న కుమడ పంచాయతీకి వెళ్ళాల్సివస్తుందని వాపోతున్నారు. కనీస రవాణా సౌకర్యం కూడా లేని కుమడ పంచాయతీకి వివిధ అవసరాల నిమిత్తం తమ పంచాయతీ ప్రజలు వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారని సర్పంచ్ రాజమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అనేకమంది సచివాలయ సేవలకు దూరమవడంతో పాటు, అర్హులై ఉండి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోలేక పోతున్నారన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు, ప్రజలకు అవసరమైన వివిధ రకాల ధ్రువపత్రాలు సకాలంలో చేయించుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దీంతో పంచాయతీ అభివృద్ధి కుంటుపడిందన్నారు. పంచాయతీకి పరిపాలన వ్యవస్థ దూరంగా ఉంటే అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఈ విషయంపై కూటమి ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్పందించి బూసిపుట్ పంచాయతీలో అసంపూర్తిగా నిలిచిన సచివాలయం భవనం నిర్మాణానికి చొరవ చూపాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ప్రజలు కె నాగేశ్వరరావు, వీ మంగ్లన్న, కె సూరిబాబు, వి గణపతి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments