నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ట్రైబల్ సెల్ ఏర్పాటుకు అధికారులు కృషి చేయాలి
చింతపల్లి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఈశ్వర రావు
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 7 (సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ట్రైబల్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చింతపల్లి ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కవడం ఈశ్వరరావు అన్నారు. గురువారం చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీకే వీధి మండలం చిన్న అగ్రహారం గ్రామానికి చెందిన వంతల కమలమ్మను పరామర్శించారు. నెలల పసిపాప అనారోగ్యంతో మృతి చెందిన విషాదం నుంచి ఇంకా కోలుకోని తల్లి, ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు కవడం ఈశ్వరరావు ఆసుపత్రికి వెళ్లి కమలమ్మ ఆరోగ్య పరిస్థితిపై పరామర్శించారు. ఈశ్వరరావు కమలమ్మ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన రక్తం కోసం బ్లడ్ బ్యాంక్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేకంగా ‘ట్రైబల్ సెల్’ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆయన అన్నారు. ఈ విషయం గౌరవ శాసనసభ్యులు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ విశ్వేశ్వర రాజు, అలాగే ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి దృష్టికి తీసుకు వెళ్లినట్లు తెలిపారు. త్వరలోనే ఈ 'ట్రైబల్ సెల్' ఏర్పాటుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు ఈశ్వరరావు పేర్కొన్నారు.
0 Comments