చింతపల్లిలోనే కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ కొనసాగించాలి
గిరిజన సంఘాల డిమాండ్
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 13(సురేష్ కుమార్ అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్): నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో చింతపల్లిలో ఏర్పాటు చేసిన కాఫీ ప్రాసెసింగ్ యూనిట్‌ను తరలించవద్దని ఆదివాసీ గిరిజన సంఘం, కాఫీ రైతు సంఘం నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు . ఈ యూనిట్‌ను తరలిస్తే చింతపల్లి ప్రాంతాన్ని 24 గంటల పాటు దిగ్బంధం చేస్తామని వారు స్పష్టం చేశారు. బుధవారం చింతపల్లి మండలంలోని గొందిపాకల పంచాయతీలో అల్లూరి సీతారామరాజు అనుచరుడు బోనంగి పండు పడాల్ 135వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కు ఈ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్, కాఫీ రైతు సంఘం నాయకులు బౌడు కుశలవుడు వినతిపత్రం సమర్పించారు. అందులో ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పరిశ్రమలు లేకపోవడంతో వేలాది మంది గిరిజన యువత నిరుద్యోగులుగా ఉన్నారని, కాఫీ, మిరియాలు, పసుపు, మొక్కజొన్న వంటి స్థానిక పంటల ఆధారంగా చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పితే గిరిజనులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. చింతపల్లి, జీకే వీధి మండలాల్లో వేల ఎకరాల్లో ఐటీడీఏ పరిధిలో కాఫీ సాగు అవుతోందనీ, కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ ఇక్కడే కొనసాగితే గిరిజన కుటుంబాలు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తాయని వివరించారు. దాదాపు రూ. 10 కోట్లతో చింతపల్లిలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌ను నర్సీపట్నం ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది గిరిజనుల ఆశలను నిరాశపరుస్తుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవో నెం. 3 రద్దు, హైడ్రో పవర్ ప్రాజెక్టుల పేరుతో నీళ్లు తరలించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో కాఫీ యూనిట్‌ను తరలించడం గిరిజన చట్టాలు, హక్కులను ఉల్లంఘించడమేనని నాయకులు పేర్కొన్నారు. ఐదో షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకే పూర్తి అధికారం ఉంటుందని, గ్రామసభల అధికారాలు బలంగా ఉన్నాయని వారు గుర్తు చేశారు.
ఈ అంశంపై స్పందించిన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, కాఫీ శుద్ధి కర్మాగారాన్ని చింతపల్లి నుంచి తరలించేది లేదని హామీ ఇచ్చారు. అవసరమైతే అదనంగా మరో రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. కలెక్టర్ హామీతో గిరిజన సంఘం నాయకులు, కాఫీ రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా గౌరవ అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్, జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజయ్, కాఫీ రైతు సంఘం జిల్లా ప్రతినిధులు బౌడు కుశలవుడు, జనకాని కనకారావు తదితరులు హాజరయ్యారు.
0 Comments