మేధో సంపత్తి హక్కులపై జాతీయ సదస్సు విజయవంతం ___కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి

మేధో సంపత్తి హక్కులపై జాతీయ సదస్సు విజయవంతం
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 19(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతపల్లిలో మేధో సంపత్తి హక్కులపై నిర్వహించిన జాతీయ సదస్సు ఘనంగా ముగిసిందని చింతపల్లి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి అన్నారు. ఈనెల 18, 19 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించిన ఈ సదస్సులో మేధో సంపత్తి హక్కులు, సమాచార సాంకేతికత వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన న్యాయవాది వై బాబ్జి మేధో సంపత్తి హక్కుల ప్రాముఖ్యతను వివరించారు. ఆధునిక సాంకేతిక పరిణామాల దృష్ట్యా ఈ హక్కులు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన స్పష్టం చేశారు. సదస్సులో కళాశాల అధ్యాపకులంతా 56 పత్రికా ప్రజెంటేషన్లు సమర్పించారు. వివిధ నూతన ఆవిష్కరణలతో అధ్యయనం చేసిన 56 పేపర్ ప్రజెంటేషన్లు ప్రత్యేకంగా కళాశాల తరఫున ఒక నూతన అధ్యయనంగా 56 పుటల పుస్తక రూపంలో వెలువడగా, దానిని మేధో సంపత్తి హక్కులలో నమోదు చేయడం జరిగింది. ఇది కళాశాలకు దక్కిన అరుదైన గౌరవమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విజయభారతి పేర్కొన్నారు. ఈ సదస్సుల ద్వారా విద్యార్థులలో సృజనాత్మకమైన నూతన ఆలోచనలతో పలు రకాల ఆవిష్కరణలు ఉత్పన్నమవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజన విద్యార్థుల కోసం ఇలాంటి జాతీయ సదస్సులు నిర్వహించడం మన్యం చరిత్రలో ఇదే మొదటి సారి అని, ఈ సదస్సును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. వీటితోపాటు విద్యార్థినీ, విద్యార్థులు రూపొందించిన పోస్టర్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, పాత్రికేయ మిత్రులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Post a Comment

0 Comments