ఆశా కార్యకర్తల భర్తీ ప్రక్రియలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకత పాటించాలి
ఆశా కార్యకర్తల నియామకాలపై సిఐటియు ఆందోళన
సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నయ్య పడాల్
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 5 (సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్): అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీ ప్రక్రియపై రాజకీయ జోక్యం లేకుండా, పారదర్శకంగా వ్యవహరించాలని, అలాగే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (సిహెచ్డబ్ల్యూ)లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ డిమాండ్ చేశారు. చింతపల్లి మండలం బలపం, కొరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆశా, సిహెచ్‌డబ్ల్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇటీవల విడుదలైన ఆశా కార్యకర్తల నియామక నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 124 పోస్టులు భర్తీ చేయనున్నారని, ఈ నెల 6వ తేదీన ఇంటర్వ్యూలు జరగనున్నాయనన్నారు. పాడేరు డివిజన్‌లో 63 పోస్టులు, రంప డివిజన్‌లో 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారన్నారు. అయితే, ఈ నియామకాలలో పారదర్శకత లోపించే అవకాశం ఉందని చిన్నయ్య పడాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌లో కొన్ని గ్రామాలలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ పని చేస్తున్న చోట కూడా ఆశా కార్యకర్త పోస్టులు భర్తీ చేయాలని ప్రకటించడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. దీనివల్ల ఏళ్లుగా తక్కువ జీతంతో పనిచేస్తున్న సిహెచ్ డబ్ల్యూ లు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఉదాహరణకు, కిలగాడ, పెదబయలు, డుంబ్రిగుడ, ఆర్.వి. నగర్, డౌనూరు వంటి పీహెచ్సీల పరిధిలోని అనేక గ్రామాల్లో 2017 నుంచి సిహెచ్ డబ్ల్యూలు కేవలం రూ.4,000 జీతంతో ఆశా కార్యకర్తలకు సమానంగా పనిచేస్తున్నారని, ఎటువంటి ఇతర రాయితీలు లేకుండా సేవలందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అంటువ్యాధులు ప్రబలే కాలంలో, కోవిడ్ సమయంలో కూడా వారు గ్రామాల్లో పర్యటించి వైద్య సేవలు అందించారని పేర్కొన్నారు. గతంలో అనేకసార్లు అధికారులను కలిసి సిహెచ్ డబ్ల్యూ లను ఆశాలుగా మార్చాలని కోరామని, ఈ విషయమై పలు నిరసనలు కూడా చేపట్టామని చిన్నయ్య పడాల్ అన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిహెచ్ డబ్ల్యూలను ఆశాలుగా గుర్తించడంలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిహెచ్డబ్ల్యులను ఆశా కార్యకర్తలుగా మార్చేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గొల్లూరి రాంబాబు, పిహెచ్‌సి కమిటీ నాయకులు పుష్ప, సంధ్య, మత్య కొండమ్మ, రాధమ్మ, బుజ్జి, పార్వతి మరియు ఇతర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments