తక్షణమే జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి

తక్షణమే జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలి 

ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి స్వామి

ఆర్డీవో కు వినతి పత్రాన్ని సమర్పిస్తున్న జర్నలిస్టులు

అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం ఆగస్టు 5 (సిహెచ్ బి ఎల్ స్వామి సీనియర్ జర్నలిస్ట్) 
జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. 2019 నాటికి రాష్ట్రంలో 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఉంటే గత ప్రభుత్వ హయాంలో కేవలం 9000 మందికి మాత్రమే అక్రిడేషన్లు ఇచ్చారని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి స్వామి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం దాటిపోతున్న పాత అక్రిడేషలనే కొనసాగిస్తున్నారని, కొత్తవి ఇంకా మంజూరు చేయకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి స్వామి మాట్లాడుతూ, తక్షణం కొత్త అక్రిడేషన్లు మంజూరు చేయాలని, అక్రిడేషన్ కమిటీలలో జర్నలిస్ట్ యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలని, జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పథకాన్ని పునరుద్ధరించాలని, జర్నలిస్ట్ హెల్త్ స్కీము సంబంధించి ఒక పర్యవేక్షక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులందరికీ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ ఈఎంజేఏ) రాష్ట్ర కార్యదర్శి కిషోర్, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ సెక్రటరీ బాబ్జి, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నర్సీపట్నం ఏరియా కమిటీ అధ్యక్షుడు విజయ్, కార్యదర్శి శ్రీనివాస్ వర్మ, నర్సీపట్నం ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రెటరీ పసుపులేటి ప్రభాకర్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యుడు అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments