సుబ్బారావు సారధ్యంలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం - కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి__కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పలువురు నాయకులు

సుబ్బారావు తోనే జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి 

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 20 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : వంతల సుబ్బారావు నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీకి అల్లూరి జిల్లాలో పునర్వైభవం రాబోతుందని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు వంతల సుబ్బారావు ఆధ్వర్యంలో అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో ఒరిస్సా మాజీ కేంద్రమంత్రి జైరామ్ పాంగితో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చింతపల్లి విచ్చేసిన ఆమెకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో కలిసి ఆమె హనుమాన్ జంక్షన్ నుండి పాత బస్టాండ్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆర్ ఎం బి కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా రాజీవ్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అణగారిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. గిరిజన ప్రాంత పరిరక్షణకు 1/70 చట్టం, చట్టసభలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మహిళలకు 30% రిజర్వేషన్ వంటి పలు సంరక్షణ చట్టాలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని అన్నారు. ఆధునిక ప్రపంచంలో సాంకేతిక రంగానికి నాడు బాటలు వేసింది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే రాష్ట్రంలో, దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అల్లూరి జిల్లా మాజీ అధ్యక్షులు వంతల సుబ్బారావు సారధ్యంలో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పునర్ వైభవం రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందులో భాగంగా పాడేరు నియోజకవర్గం నాయకత్వ పగ్గాలను సుబ్బారావుకు అప్పచెబుతూ ఆయనకు తల పాగాను, ఖడ్గాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా వంతల సుబ్బారావు ఆధ్వర్యంలో కృపారాణి సమక్షంలో అల్లూరి జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలు సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీ కండువాను వేసుకుని పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారిలో వైకాపాకు చెందిన చింతపల్లి మాజీ ఎంపీపీ వంతల బాబూరావు, చింతపల్లి విశ్రాంత ఉద్యోగులు చల్లంగి కృష్ణారావు, జిమాడుగులకు చెందిన వైసిపి సీనియర్ నాయకులు మర్రి ఆనంద్, అదే పార్టీకి చెందిన లోతుగడ్డ పంచాయతీ మాజీ సర్పంచ్ వంతల బాబురావు, తదితరులు వారి సహచరులతో కలిసి పార్టీలో చేరారు. వారిని పార్టీ పెద్దలు, జిల్లా అధ్యక్షులు, అతిథులు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. మన్యంలో సుబ్బారావు నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, కడప మాజీ పీసీసీ అధ్యక్షుడు జి. శ్రీరాములు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి జానీ బాయ్, ఆర్జీపిఆర్ఎస్ కోఆర్డినేటర్, అరకు నియోజకవర్గం నోగెల చంద్రకళ, శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనుబాబు, తెలంగాణ సీనియర్ నాయకులు పృథ్వీరాజ్ నాయక్, యువ నాయకులు వంతల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments