అనధికార లే-అవుట్లు, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలి
జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ
అల్లూరి జిల్లా, పాడేరు ఆగష్టు 21(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): అనధికార లే-అవుట్లు, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ఆదేశాల మేరకు, పాడేరు ఐటిడిఎ సమావేశ మందిరంలో గురువారం ఉదయం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం మరియు పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు , ఇంజనీరింగ్ అసిస్టెంట్లు మరియు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు లే-అవుట్లు మరియు భవన నిర్మాణ అనుమతులు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని 43O గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి కొంతమంది అనధికార లే-అవుట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, గ్రామ పంచాయతీలలో అనుమతులు పొందకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాటిని నియంత్రించడంలో పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్య వైఖరి అవలంభించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా, నిర్ణీత ప్రమాణాలతో అంతర్గత రోడ్లు, డ్రెయిన్లు ఏర్పాటు చేయకుండా, సామాజిక అవసరాలకు లే అవుట్ మొత్తం స్థలంలో 10 శాతం స్థలం గ్రామ పంచాయతీలకు కేటాయించకుండా ఏర్పాటు చేసిన లే అవుట్ల పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ చామంతి , అసిస్టెంట్ డైరెక్టర్ శ్రావణి, డి.టి.సి. పి.ఓ రామానాయుడు పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు శిక్షణ ఇచ్చారు. గ్రామకంఠం భూములలో G+2 లేదా 9 మీటర్ల ఎత్తు వరకూ రెవెన్యూ భూములలో G+3 లేదా13 మీటర్ల ఎత్తు వరకూ భవన నిర్మాణాలు చేయవచ్చని, భవన నిర్మాణం చేపట్టే యజమానులు భవనం చుట్టూ సెట్ బ్యాక్స్ ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలలో బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ అమలులో లేదని, వాణిజ్య సముదాయాల నుండి నిర్దేశించిన ఫీజులు వసూలు చేయాలని సూచించారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారి చంద్ర శేఖర్ ,గ్రామ సచివాలయాల జిల్లా నోడల్ అధికారి పి. యస్. కుమార్, జిల్లా మలేరియా అధికారి తులసి, గ్రామీణ నీటి సరఫరా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు మరియు BSNL ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు ప్రజారోగ్యం, త్రాగునీటి సరఫరా, సచివాలయాల నిర్వహణ, పి4 పథకం , నెట్ వర్క్ అంశాలపై శిక్షణ ఇచ్చారు.
0 Comments