కురుస్తున్న వర్షాలతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి__అరుకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ తనుజరాణి

కురుస్తున్న వర్షాలతో అల్లూరి జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి
అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ తనుజారాణి

అల్లూరి జిల్లా, అరకు ఆగస్టు 18 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : మన్యంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అరకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ గుమ్మ తనుజారాణి అన్నారు. పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు 2025 నిమిత్తం భారత రాజధాని ఢిల్లీలో ఉన్న ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటన ద్వారా ఆమె అల్లూరి జిల్లా మరియు పార్వతిపురం మన్యం జిల్లాలో ఈదురు గాలులు, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించిందన్నారు. ఈ మేరకు వర్షాల సహాయక చర్యల నిమిత్తం అల్లూరి జిల్లా కలెక్టరేట్ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నెంబరు: 08935293448, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబరు: 08963 293046 ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కంట్రోల్‌ రూమ్‌ 24/7 ప్రకారం పనిచేస్తుందన్నారు. ఏదేని అనుకోని అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పైన తెలిపిన కంట్రోల్‌ రూమ్‌ నంబరుకు ఫోన్‌ చేయవచ్చునని ఎంపీ  పేర్కొన్నారు. అలాగే ఆర్డీవో కార్యాలయాలు, తాహసిల్దార్‌ కార్యాలయంలో కూడా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసుకోవాలని, ఇరు జిల్లాల కలెక్టర్ లకు సూచించినట్లు తెలిపారు. నదులు, వంకలు, పరివాహక ప్రాంతాలు, అన్ని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కాలువలకు గండ్లు పడే అవకాశం ఉండొచ్చనీ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. రైతులు వారికి సంబంధించిన పంటలు, ధాన్యము, పశు సంపదను సురక్షితంగా కాపాడుకునే చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలందరూ అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రమాదకరంగా నీరు ప్రవహించే కల్వర్టుల వద్ద వాహనాల రాకపోకలను నియంత్రించాలన్నారు. వైద్య సేవలకు అంతరాయం కలగకుండా అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన మందులను సిద్దంగా ఉంచుకోవాలని వైద్యశాఖాధికారులను ఆదేశించినట్లు ఆమె ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచారు. వరద, వర్షం ప్రభావిత ప్రాంత ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

అత్యవసర పరిస్థితులలో సంప్రదించాల్సిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు : +91 99666 33304, +91 94949 95333, +91 94944 14619.

Post a Comment

0 Comments