వంతెన మధ్యలో గుంత - ప్రమాదపుటంచులో ప్రయాణికులు

వంతెన మధ్యలో గుంత... ప్రమాదపుటంచులో ప్రయాణికులు

అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 16 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): మండలంలోని చింతపల్లి - చౌడుపల్లి రహదారిపై ఉన్న ఒక వంతెన ఇప్పుడు ప్రయాణికులకు పెద్ద ముప్పుగా మారింది. ప్రమాదపుటంచున ఉన్న ఈ వంతెన మధ్యలో గుంత పడి రోజురోజుకు గుంత పరిమాణం పెరుగుతుండడంతో, ఏ క్షణమైనా కూలిపోయేలా ఉంది. ఈ సమస్యపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి స్మశాన వాటిక సమీపంలో ఉన్న ఈ వంతెన దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోలేదు. రానురాను శిథిలావస్థకు చేరుకున్న ఈ వంతెన మీద ప్రయాణం చేయడం అంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడమే అని వాహనదారులు అంటున్నారు. అసలే ఇరుకుగా ఉండే ఈ వంతెన మధ్యలో పడిన గుంత కారణంగా, ముఖ్యంగా రాత్రిపూట ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. దురదృష్టవశాత్తు ఈ వంతెన కూలితే చింతపల్లి - చౌడుపల్లికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది. రహదారులు, భవనాల శాఖ అధికారులు వెంటనే స్పందించి, వంతెనను పటిష్టం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా వంతెనపై నీరు నిలిచి, కాంక్రీటు మరింత బలహీనపడే అవకాశం ఉంది. దీని వల్ల వంతెన కూలిపోయే ప్రమాదం మరింత పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించకపోతే, పెను ప్రమాదం జరిగి, ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారించి, వంతెనకు మరమ్మత్తు పనులు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0 Comments