భారీగా పట్టుబడిన నాటు సారా, తయారీ ముడిసరుకు
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 9(సురేష్ కుమార్, అల్లూరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్) : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని తమ్మింగుల పంచాయతీ పరిధిలో ఎక్సైజ్ అధికారులు మెరుపుదాడి చేసి భారీ స్థాయిలో నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం పులుపు, నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి ఎక్సైజ్ సీఐ కుర్మారావు నేతృత్వంలో సిబ్బందితో కలిసి ముందస్తుగా అందిన సమాచారం మేరకు సాగిన చిట్టిబాబు అనే వ్యక్తి నివాసంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఏకంగా 3,000 లీటర్ల బెల్లం పులుపుతో పాటు, 50 లీటర్ల నాటు సారా లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారు రూ. 1.50 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గత వారం రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో బెల్లం పులుపు పట్టుబడటం ఇదే మొదటిసారి అని ఎక్సైజ్ సిబ్బంది తెలిపారు. ఈ కేసులో నిందితుడైన సాగిన చిట్టిబాబును అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఎక్సైజ్ సీఐ కుర్మారావు వెల్లడించారు. ఎవరైన నాటు సారా తయారీ, క్రయవిక్రయాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. నాటు సారా, గంజాయి వంటి మత్తు పానీయాలు, ధూమపానానికి దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీటి వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజలకు వివరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా ఎక్సైజ్ శాఖకు తెలియజేయాలని సీఐ కోరారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేశామని ఆయన స్పష్టం చేశారు.
0 Comments