వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి

వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి

రాష్ట్రవ్యాప్త కోర్కెల దినాన్ని పాటించిన వర్కింగ్ జర్నలిస్టులు

చింతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సతీష్

అల్లూరి జిల్లా, చింతపల్లి(సురేష్ కుమార్ స్టాఫ్ రిపోర్టర్) ఆగస్టు 5 : రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు వెంటనే జారీ చేయాలని, తక్షణమే జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని చింతపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేశెట్టి సతీష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) పిలుపుమేరకు మంగళవారం చింతపల్లి ప్రెస్ క్లబ్ వద్ద వర్కింగ్ జర్నలిస్టులు "రాష్ట్రవ్యాప్త కోర్కెల దినం"ను పాటించారు. అందులో భాగంగా చింతపల్లి వర్కింగ్ జర్నలిస్టులంతా కలిసి జర్నలిస్టుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ స్థానిక తహసిల్దార్ ఆనంద రాజుకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సతీష్, గౌరవ అధ్యక్షులు దయానంద్, కార్యవర్గ సభ్యులు కాసిం వల్లీలు జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలపై వారు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయడంలో అనవసరమైన జాప్యం చేస్తోందన్నారు. అక్రిడిటేషన్ లేకపోవడంతో జర్నలిస్టులు అనేక సౌకర్యాలను పొందలేకపోతున్నారనీ, 2019 నాటికి రాష్ట్రంలో 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఉండగా, 2019-2024 మధ్య గత ప్రభుత్వం అడ్డగోలు నిబంధనలు, అసందర్భ నియమాలతో అక్రిడిటేషన్ల సంఖ్యను 9,000కు తగ్గించిందని ఆరోపించారు. పాత అక్రిడిటేషన్ల గడువును మాటిమాటికి పొడిగిస్తూ, కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వకుండా గత ప్రభుత్వం జర్నలిస్టులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసిందన్నారు. దీనివల్ల అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు లేకపోవడమే కాకుండా, వారికి హెల్త్ కార్డు పొందే అవకాశం కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు అక్రిడిటేషన్ నియమాల సవరణకు సంబంధించిన కొత్త జీవో విడుదల కాకపోవడం దురదృష్టకరమన్నారు. పాత అక్రిడిటేషన్ల గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించారని గుర్తు చేశారు. మరోసారి గడువు పొడిగించకుండా, అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీలలో జర్నలిస్టుల యూనియన్లకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ పథకంతో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులు గౌరవప్రదమైన విశ్రాంత జీవితాన్ని గడపడానికి వీలుగా అనేక రాష్ట్రాలలో అమలు చేస్తున్న పాత్రికేయ పెన్షన్ పథకాన్ని మన రాష్ట్రంలోనూ ప్రారంభించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2016లో ప్రవేశపెట్టి, గత ప్రభుత్వం నిలిపివేసిన ప్రమాద బీమా పథకాన్ని వెంటనే తిరిగి ప్రారంభించాలని కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి మండల పాత్రికేయులు పలువురు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments