దారుణమైన స్థితిలో బీసీ హాస్టల్
పెచ్చులు ఊడుతున్న భవనాలలోనే విద్యార్థులు
నాలుగే గదులు, 78 మంది విద్యార్థులు
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 18 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : మండల కేంద్రంలోని బాలికల బీసీ హాస్టల్ దారుణమైన స్థితిలో ఉందని, అక్కడ ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థినులంతా గిరిజనులేనని ఆదివాసి గిరిజన సంఘం గౌరవాధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఐటీడీఏ క్వార్టర్స్ వద్ద ఉన్న బాలికల బీసీ హాస్టల్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగే గదులు 78 మంది పిల్లలు, హాస్టల్ మొత్తం పెచ్చులు ఊడిపోయి రూములు మొత్తం వర్షపు నీటితో తడిసిపోతుందనీ, బీసీ వెల్ఫేర్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్నారు. వారానికి ఒక్కరోజే వార్డెన్ వస్తారని మిగతా రోజులు అంతా వంట మనుషులే పర్యవేక్షకులుగా ఉంటారన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా బిసి వెల్ఫేర్ హాస్టల్ నడుస్తుందనీ, గతంలో ఈ ప్రాంతం నుంచే కాక కింద ప్రాంతాల నుంచి వచ్చి ఈ హాస్టల్లో చదువుకునేవారన్నారు. ఇప్పుడు బీసీ పిల్లలు తక్కువ గిరిజన పిల్లలు ఎక్కువగా ఉన్నారన్నారు. ఎప్పుడో కట్టిన క్వార్టర్ బిల్డింగ్ కావడం వల్ల పూర్తిగా శిథిల వ్యవస్థకు వచ్చి భవనం సీలింగ్ పెచ్చులు ఊడి పడుతున్నాయని అన్నారు. అయినా అధికారులలో చలనం లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వసతి గృహమో, అనాధాశ్రమమో అనే రీతిలో ఈ హాస్టల్ పరిస్థితి ఉందని ఆరోపించారు. బిల్డింగ్ రిపేర్ కోసం రెండు లక్షలు వచ్చిందని చెప్తున్నా కనీస మరమ్మతు చేయడానికి నోచుకోలేదని మండిపడ్డారు. వారానికి ఒక్కరోజే వార్డెన్ వస్తుంటారని విద్యార్థినులు తన వద్ద వాపోయారన్నారు. ఈ వారం రోజులపాటు వంట మనుషులే వార్డెన్ రూపంలో అవతారం ఎత్తుతారని అన్నారు. ప్రభుత్వం మరియు జిల్లా స్థాయి అధికారులు స్పందించి విద్యార్థినిలు యొక్క హాస్టల్ రూమ్ ల సమస్య పరిష్కరించకపోతే విద్యార్థినులందరూ సమస్య పరిష్కారం కోసం రోడ్డుమీదకు వస్తారని హెచ్చరించారు.
0 Comments