వంతెన దాటుతూ వరద ఉధృతికి కొట్టుకుపోయిన యువకుడు___ హై లెవెల్ వంతెన లేకపోవడం వల్లే ఘటనలు, ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ ఆందోళన___బాధితుని కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్

వంతెన దాటుతూ వరద ఉధృతికి కొట్టుకుపోయిన యువకుడు 
హై లెవెల్ వంతెన లేకపోవడం వల్లే ఘటనలు, ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ ఆందోళన

బాధితుని కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ 

అల్లూరి జిల్లా, హుకుంపేట ఆగస్టు 18 (సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): వంతెన దాటుతూ వరద ఉధృతిలో కొట్టుకుపోయి యువకుడు మృతి చెందిన విషాద ఘటన అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండలం అడ్డుమండ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం హుక్కుంపేట మండలం అడ్డుమండ పంచాయతీకి చెందిన కంబిడి కుమారస్వామి(41), 17వ తేదీ ఆదివారం సాయంత్రం దిగమోదపుట్టు నుండి అడ్డుమండ గ్రామమునకు చేరుకునే ప్రయత్నంలో దిగమోదపుట్ - అడ్డుమండ గ్రామాల మధ్య ఉన్న వంతెన దాటుతుండగా అడ్డుమండ గడ్డలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఉధృతికి వంతెనపై నడుస్తున్న కుమారస్వామి కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల కాపాడలేకపోయామని ఈ సందర్భంగా వారు వాపోయారు. పెద్దగడ్డలో కొట్టుకుపోయి గల్లంతయిన కుమారస్వామి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెతికే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఈ వరద నీరు బుంగపుట్టు గడ్డను కలుపుకొని హుకుంపేట, రాళ్లగడ్డకి వెళుతూ పెదబయలు మీదుగా జోలాపుట్, డుడుమకు చేరుకుంటుంది. అయితే గతంలో అడ్డుమండ ప్రజలతో పాటు దిగమోదపుట్టు పుచ్చల పంచాయతీకి చెందిన సుమారు 50 గ్రామాల ప్రజలు బ్రిడ్జి నిర్మాణాన్ని ఎక్కువ ఎత్తులో నిర్మాణం చేపట్టాలని వేడుకున్న ప్రభుత్వం, అధికారులు స్పందించలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. హై లెవెల్ బ్రిడ్జి ఏర్పాటు చేసి ఉంటే ఇటువంటి ప్రాణాపాయాలు తప్పేవని, ఈ గడ్డలో అనేకమంది ఇప్పటికే మృత్యువాత చెందారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి సారించి ఈ రెండు పంచాయతీలను కలుపుతూ హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని వేడుకుంటున్నారు. అలాగే చనిపోయిన కుమారస్వామి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, తక్షణమే 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
ఈ ఘటనపై స్పందించిన అడ్డుమండ సర్పంచ్ గుమ్మ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే యువకుడు మృత్యువాత చెందాడని, హైలెవెల్ బ్రిడ్జి నిర్మించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావని అన్నారు. గతంలో ప్రజలతో కలిసి స్థానిక ఎంపీ సహాయంతో ఉన్నతాధికారులకు అనేకమార్లు బ్రిడ్జి నిర్మాణంపై విన్నవించుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయిందని, నేడు కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు వంతెన పైనుంచి ఉదృతంగా ప్రవహించడంతో అది దాటే క్రమంలో యువకుడు మృత్యువాత చెందాడని వాపోయారు. యువకుడి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ వంతెన నిర్మాణంతో సుమారు 50 గ్రామాల ప్రజలు సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు చేరుకుంటారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఎక్కువ ఎత్తుతో వంతెన నిర్మాణానికి పూనుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments