ఫోటోగ్రఫీని వృత్తి గానే కాదు సమాజాన్ని ఆవిష్కరించే కళగా ఉపయోగించాలి
చింతపల్లిలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం
శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాసరావు
అల్లూరి జిల్లా, చింతపల్లి ఆగస్టు 19(సురేష్ కుమార్, పాడేరు స్టాఫ్ రిపోర్టర్): యువత ఫోటోగ్రఫీని కేవలం వృత్తి గానే కాకుండా సమాజాన్ని ఆవిష్కరించే కళగా ఉపయోగించాలని శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ యూనియన్ అధ్యక్షులు అల్లంకి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని చింతపల్లి మండలంలోని శ్రీ ముత్యాలమ్మ ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో చింతపల్లి, జికే వీధి మండలాల ఫోటోగ్రాఫర్లు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఫోటోగ్రఫీ పితామహుడు, కెమెరా రూపకర్త లూయిస్ డాగెరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఫోటోగ్రాఫర్ల ఐక్యతను చాటుతూ పాత బస్టాండ్ నుండి హనుమాన్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రాంతీయ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు, పాలు, బ్రెడ్లను అందజేశారు. ఈ సందర్భంగా చింతపల్లి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన యూనియన్ సమావేశంలో అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ, 1839లో ఫ్రాన్స్ ప్రభుత్వం ఆగస్టు 19న డాగేరియోటైప్ ప్రక్రియను ప్రపంచానికి ఉచితంగా ప్రకటించిందనీ, దీనివల్ల ఫోటోగ్రఫీ ఓ శాస్త్రంగా, కళగా ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిందన్నారు. డాగేరియోటైప్ ప్రక్రియను అభివృద్ధి చేసిన ఫ్రెంచ్ శాస్త్రవేత్త లూయిస్ డాగెరే స్మృతికి నివాళిగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటామని వివరించారు. నేటి సాంకేతిక యుగంలో ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకునేందుకు ఔత్సాహికులు అనేకమంది ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. నేడు మొబైల్ ఫోన్ల రాకతో ఫోటోగ్రఫీ అనేది ప్రతి ఒక్కరి అభిరుచిగా మారిందని, కానీ దాన్నే వృత్తిగా ఎంచుకున్న వారికి మాత్రం అవకాశాలు అడుగంటాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఫోటోగ్రాఫర్లు వృత్తిపరంగా కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఫోటోగ్రఫీ అనేది కేవలం చిత్రాలను తీయడం మాత్రమే కాదనీ, అది కథలను చెప్పే శక్తివంతమైన మాధ్యమమని, ఇది జ్ఞాపకాలను పదిలపరుస్తుందని, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుందనీ సంస్కృతులను తరతరాలకు అందిస్తుందని తెలిపారు. అనంతరం, మండలంలోని ప్రముఖ ఫోటోగ్రాఫర్లకు, యువ ప్రతిభావంతులకూ సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లు ఉపాధ్యక్షుడు పూజారి లీలా ప్రసాద్, కార్యదర్శి గబులంగి రవి ప్రసాద్, కోశాధికారి గొర్లె నగేష్, కార్యవర్గ సభ్యులు, చింతపల్లి, జి కే వీది మండలాల ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.
0 Comments