రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యులు, అధికార యంత్రాంగం ప్రజలకు అవగాహన కల్పించి వారిలో మనోధైర్యం నింపాలని మాజీ మంత్రి, వైకాపా నాయకుడు పసుపులేటి బాలరాజు అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ సమర్థవంతంగా అమలు జరిగేందుకు అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు. మన్యంలో వారపు సంతలు రద్దు చేయడం వల్ల కూరగాయలు, నిత్యావసర సరకులకు కొరత ఏర్పడిందన్నారు. పనులకు వెళ్లే మార్గం లేక, పండించిన పసుపు, చింతపండు వంటి వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోలేక గిరిజనులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార యంత్రాంగం గ్రామాలను సందర్శించి గిరిజనులకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. అలాగే గిరిజన ప్రజలకు నిత్యావసర సరుకులను అందజేయాలన్నారు. ప్రజలు కూడా లాక్ డౌన్ కి పూర్తి సహకారం అందించాలన్నారు . నిర్ణయించిన సమయంలో మాత్రమే మాస్కులు ధరించుకొని నిత్యావసర సరుకులు కొనుగోలు కోసం బయటకు రావాలన్నారు. మిగిలిన సమయాల్లో గృహానికి పరిమితం కావాలని ఆయన సూచించారు . గిరిజన ప్రాంతానికి వైరస్ వ్యాప్తి చెందకుండా గా అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది అన్నారు.
0 Comments