నర్సీపట్నం(విఎస్ జె ఆనంద్): నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు ఆంగ్ల మాధ్యమ బోధన అవసరం లేదా అని టిడిపి నాయకులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రశ్నించారు. శనివారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో ఆయన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేదలు బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారన్నారు. ఈ నిరుపేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఆంగ్ల మాధ్యమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్ల మాధ్యమం అవసరత ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమ విద్యను అందిస్తే వైసిపి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని జీర్ణించుకోలేని టిడిపి నాయకులు అడ్డు పడుతున్నారన్నారు. ఆంగ్లమాధ్యమ బిల్లును ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు శాసనమండలిలో అడ్డుకున్నారన్నారు . ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమ బోధనపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేస్తే అది తెలుగు ప్రజల విజయంగా టిడిపి నాయకులు, అయ్యన్నపాత్రుడు చెప్పుకోవడం దురదృష్టకరమన్నారు. అయ్యన్నపాత్రుడు పిల్లలు ఎక్కడ చదువుకున్నారో స్పష్టం చేయాలని , ఆయన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకో లేదా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ ని అమెరికాలో చదివించారని, మనవడిని కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారన్నారు. ఇంగ్లీష్ మీడియం అమలుని మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు స్వాగతి స్తున్నాయన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సంతోషిస్తున్నారన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేసినప్పటికీ తెలుగు భాషకు ఎక్కడ విఘాతం కలిగించకుండా తెలుగు పాఠ్యాంశాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు బినామీ లైన నారాయణ కళాశాలలు పాఠశాలలు కాపాడుకోవడానికి ఆంగ్ల మాధ్యమాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కరోనా విపత్తు పైన కూడా రాజకీయం చేస్తారా..?
కరోనా విపత్తుని కూడా టిడిపి నాయకులు రాజకీయం చేయడం చాలా దురదృష్టకరమని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. నాడు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేస్తుంటే ప్రతిపక్ష పార్టీ టిడిపి నాయకులు అడ్డుకున్నారు. తాజాగా కరోనా విపత్తును కూడా టిడిపి నాయకులు రాజకీయం చేయడం చాలా బాధాకరమన్నారు. విశాఖపట్నానికి రాజధానిని తరలించేందుకు కరోనా వైరస్ కేసులను తక్కువగా చూపిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించడం సిగ్గుచేటన్నారు . కరోనా వైరస్ కేసులను దాయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, విధి విధానాల వల్ల రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిలకడగా ఉందన్నారు. నర్సీపట్నంలో గతంలో నమోదైన రెండు కరోనా వైరస్ పాజిటివ్ కూడా ప్రస్తుతం నెగిటివ్ వచ్చాయని, అధికారులు గ్రామ వలంటీర్లు, పాత్రికేయులు, అన్ని వర్గాల ప్రజల సహకారంతో త్వరలోనే నర్సీపట్నం కంటెయిన్మెంట్ జోన్ పరిస్థితిని కూడా తొలగించుకునే అవకాశం ఉందన్నారు.
0 Comments