విశాఖలో కరోనా కలకలం.. రోజురోజుకు పెరుగుతున్న బాధితులు.. మరో నలుగురికి పాజిటివ్‌..ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు..

విశాఖ నగరంలో మరో నలుగురికి శుక్రవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య పదిహేనుకు చేరింది. తాజాగా వైరస్‌ బారినపడిన వారిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. రైల్వే న్యూకాలనీ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. రైల్వే న్యూ కాలనీకి చెందిన 30 ఏళ్ల యువకుడు కొద్దిరోజుల కిందట ముంబై వెళ్లాడు. గత నెల 24న తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు 26న కేజీహెచ్‌కు తీసుకువెళ్లారు. ఆ తరువాత కూడా జ్వరం తగ్గకపోవడంతోపాటు ఒళ్లు నొప్పులు, దగ్గు వంటివి తోడు కావడంతో కేజీహెచ్‌ వైద్యుల సూచన మేరకు గత నెల 27న ప్రభుత్వ ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో అతనితోపాటు అతని, కుటుంబ సభ్యులను కూడా వైద్యులు ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచించారు. వారి నుంచి నమూనాలు సేకరించి వైరస్‌ నిర్ధారణ కోసం కాకినాడ పంపించారు. అందులో ముగ్గురికి వ్యాధి సోకినట్టు శుక్రవారం నివేదిక వచ్చింది. యువకుడితోపాటు అతని అత్త (55), బావమరిది (23) కూడా వైరస్‌ బారినపడినట్టు నిర్ధారణ అయింది

Post a Comment

0 Comments