ఒక్కరోజు ఆలస్యమైతే చింతపల్లి పరిస్థితి ఏమై ఉండేది ..? ఆలస్యంగా వెలుగు చూసిన వాస్తవం ఏమిటి..?

అన్వేషణ ప్రత్యేక కథనం..

చైనాలో పురుడుపోసుకున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచదేశాలకు విస్తరించి ప్రజలను గడగడా వణికిస్తుంది.  మాయదారి మహమ్మారి వైరస్ మన దేశంలో కూడా చాపకింద నీరులా పాకిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం  ప్రధానమంత్రి మోదీ  ప్రజలను  అప్రమత్తం చేస్తూ మార్చి  22 న జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చి దేశ ఐక్యతను చాటారు.  అయితే  కరోనా వైరస్  చెయ్యి దాటి పోయే ప్రమాదం ఉందని పసిగట్టిన మోడీ  మరుసటి రోజు నుంచి లాక్ డౌన్ ప్రకటించారు. అయితే అప్పటికే  కంటికి కనిపించని శత్రువు కరోనా వైరస్ దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించింది. అధికారికంగా కరోనా వైరస్ బాధితులను వెంటనే గుర్తించకపోయినా  భారతదేశ ప్రజలను వెతుక్కుంటూ వచ్చేసింది.  
సకాలంలో స్పందించిన ఆ ఇద్దరు అధికారులు ..
లాక్ డౌన్  ప్రకటించిన మరుక్షణమే పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ డీకే స్పందించారు. గిరిజన ప్రాంతాలకు మైదాన ప్రాంతాల నుంచి ఏ ఒక్కరూ అడుగుపెట్టకుండా గా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. వెనువెంటనే ప్రతి మండలానికి త్రీ మన్  కమిటీ(ఎంపిడివో, తాసిల్దార్, ఎస్ఐ) నీ  ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు రంగప్రవేశం చేసిన చింతపల్లి ఏఎస్పి ఎస్ .సతీష్ కుమార్ చింతపల్లి౼ నర్సీపట్నం ప్రధాన రహదారి పై రాకపోకలను నిషేధించారు. డౌనూర్ లో చెక్ పోస్ట్ ని కూడా ఏర్పాటు చేశారు. దీంతో మైదాన ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంతానికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చింతపల్లి ఏ ఎస్పి  సకాలంలో స్పందించడం వల్ల చింతపల్లి కి పెను ముప్పు తప్పిందని చెప్పడంలో సందేహమే లేదు.
ఒక్కరోజు ఆలస్యమైతే..?
ఐటీడీఏ అధికారుల చర్యలు ఒక్కరోజు ఆలస్యమైతే కరోనా వైరస్ చింతపల్లి కి వ్యాప్తి చెంది ఉండేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నిజాముద్దీన్ లో మార్చి 10, 11,12 తేదీల్లో జరిగిన మత ప్రార్థనలో పాల్గొన్న తమిళనాడుకు చెందిన పది మంది(ఐదుగురు భార్యాభర్తలు) విశాఖ ఏజెన్సీలో మత ప్రచారం చేయాలనే లక్ష్యంతో మార్చి 19న తమిళనాడు నుంచి నర్సీపట్నానికి చేరుకున్నారు. ఆ 10 మంది వ్యక్తులు, నర్సీపట్నంలో కొందరి సలహాలు, సూచనలు తీసుకుని 22, 23 తేదీల్లో చింతపల్లి ప్రాంతానికి రావాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల  సమాచారం. అయితే లాక్ డౌన్ కారణంగా చింతపల్లి౼నర్సీపట్నం ప్రధాన రహదారి బ్లాక్ చేయబడిందని తెలుసుకున్న ఆ 10 మంది వ్యక్తులు నర్సీపట్నం లోనే ఉండి పోయారు. ఒకవేళ ఐ.టి.డి.ఎ  పిఓ, చింతపల్లి ఏ ఎస్పి  డౌనూర్ లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడంలో  ఒక్కరోజు ఆలస్యమైనా ఆ పది మంది వ్యక్తులు కూడా చింతపల్లి పరిసర ప్రాంతాలను సందర్శించి మత ప్రచారం నిర్వహించి ఉండేవారు. గిరిజన ప్రాంతానికి వెళ్లే అవకాశం లేకపోవడం వల్ల తమిళనాడుకు చెందిన  10 మంది వ్యక్తులు నర్సీపట్నం లోనే ఉండి పోయారు. నిజాముద్దీన్ ప్రార్థనలకు హాజరైన వ్యక్తులు నర్సీపట్నంలో ఉన్నారని జిల్లా ఎస్పీ బాపూజీ , నర్సీపట్నం ఏఎస్పీ రిశాంత్ రెడ్డి చాకచక్యంగా గుర్తించి ఏప్రిల్ ఒకటో తేదీన విశాఖపట్నం క్వారంటైన్ కి  పంపించారు. క్వారంటైన్ లో ఉన్న పది మందిలో ఇద్దరికీ కరోనా వైరస్ నిర్ధారణ జరిగింది. లాక్ డౌన్ చర్యలు  అమలులో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బాలాజీ డీకే, చింతపల్లి ఏఎస్పీ సతీష్ కుమార్  సకాలంలో స్పందించకపోతే నేడు చింతపల్లి పరిస్థితి కూడా నర్సీపట్నం మాదిరిగా ఉండేది . గిరిజన ప్రాంత ప్రజలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బాలాజీ, చింతపల్లి ఏఎస్పీ సతీష్ కుమార్ లను ప్రతి ఒక్కరూ అభినందించాలి . 

Post a Comment

0 Comments