చింతపల్లి ఏప్రిల్ 8 (షేక్. కాశిమ్ వలీ): మండలంలో గాలివానకు కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైకప్పు (రేకులు) కూలి పడ్డాయి. దీంతో విధుల్లో ఉన్న స్టాఫ్ నర్స్ తలకు గాయమైంది. బుధవారం బలపం పంచాయతీ పరిధిలో గాలి వర్షం కురిసింది. బలపం కోరుకొండ లో ఆ ప్రాంతప్రజల సౌకర్యార్థం గతంలో అధికారులు రేకుల భవనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనం ఇటీవల మరమ్మతులకు గురైందని, అయినా తప్పని పరిస్థితుల్లో చాలీచాలని రేకుల భవనంలో వైద్యులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఒకేసారి ఈదురుగాలులతో వర్షం కురవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పైకప్పు కూలి పడింది. ఈ ఘటనలో ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న స్టాఫ్ నర్స్ వసంతకుమారికి తలపై గాయమైందన్నారు. మరో స్టాప్ నర్స్ స్వాతి, ఉద్యోగులు సుమర్ల అప్పారావు, వెంకటరమణ, రోగులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇప్పటికైనా బలపం కోరుకొండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శాశ్వత పక్కా భవనం నిర్మించాలని ప్రాంతీయులు విజ్ఞప్తి చేస్తున్నారు.
0 Comments