విశాఖ మన్యానికి కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి ఆదివాసి ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు కలిసిరావాలని పి ఆర్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు యు వి గిరి అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన పత్రికా విలేకరులతో మాట్లాడుతూ.. ఆదివాసి ప్రజలకు కరోనా వైరస్ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కనీస అవగాహన లేదన్నారు. అయితే లాక్ డౌన్ కారణంగా ఆదివాసీలు గృహానికి పరిమితమయ్యారని, పొరుగు గ్రామాల నుంచి కూడా ఇతరులను వారి గ్రామాలకు రానివ్వడం లేదని ఇది వైరస్ వ్యాప్తి నివారణకు ఒక మంచి పరిమాణమే అని ఆయన అన్నారు. అయితే ఆదివాసీలు భౌతిక, సామాజిక దూరం పాటిస్తూ జీవనం సాగించడం లేదని, అలాగే తరచూ చేతులను కూడా శుభ్రం చేసుకోవడం లేదన్నారు. కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది..? లక్షణాలు ఏమిటి ..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బాలాజీ కృషి ఫలితంగా అధికారులు ఒడిస్సా, మైదాన ప్రాంతాల నుంచి ఇతరులు గిరిజన ప్రాంతానికి రాకుండగా ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలు తనిఖీలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ మేరకు ప్రాథమిక స్థాయిలోనే కరోనా వైరస్ వ్యాప్తి కొంతవరకు అడ్డుకట్ట పడింది అన్నారు. అయితే అధికారుల కంటపడకుండా గిరిజన గ్రామాలకు మైదాన ప్రాంత ప్రజలు వచ్చి ఆశ్రయం పొందే అవకాశం లేకపోలేదన్నారు. ఇదే జరిగితే వైరస్ వ్యాప్తికి ఇదొక మార్గం అవుతుందన్నారు. ఇక వారపు సంతలు రద్దు కావడం వల్ల ఆదివాసీలు కనీస నిత్యావసర సరుకులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గిరిజన ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు ఓవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఆదివాసీలను చైతన్యవంతులను చేస్తూనే మరోవైపు వారికి అవసరమైన నిత్యావసర సరుకులను గ్రామాలకు చేరవేసే కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే కరోనా వైరస్ నుంచి ఆదివాసులను రక్షించుకోవచ్చు అని, చింతపల్లి ప్రాంతంలో ఇప్పటికే తాము ప్రారంభించామని ఆయన తెలిపారు.
0 Comments