కంటెయిన్మెంట్ జోన్ ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనపై ఉంది.. వలంటీర్లు పూర్తిస్థాయి సేవలందించాలి: నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్

సమావేశంలో మాట్లాడుతున్న నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్

నర్సీపట్నం(విఎస్ జే ఆనంద్):
పట్టణ కేంద్రం కంటెయిన్మెంట్ జోన్ ప్రజల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత గ్రామ వాలంటీర్ల పై ఉందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఆదివారం ఉదయం  పట్టణ కేంద్రంలో అధికారులు కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, పట్టణ సీఐ అప్పలనాయుడు తో కలిసి సందర్శించారు. అనంతరం గ్రామ వలంటీర్ల తో  ఆయన సమావేశమయ్యారు. జిల్లాలో 7  కంటెయిన్మెంట్ జోన్లు ఉన్నాయన్నారు. 6 జోన్లు వైజాగ్ లో ఉండగా ఒక జోన్ నర్సీపట్నంలో ఉందన్నారు. పట్టణంలోని ఉన్న 28 వార్డ్ లో ప్రజల సంరక్షణ కోసం రెండు కరోనా వైరస్ పాజిటివ్ నమోదైన  23,24,25 వార్డు ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ జోన్ల పరిధి ప్రజలు గృహానికి పరిమితమయ్యారన్నారు. బయటకు వచ్చే పరిస్థితి వారికి లేదన్నారు. కంటెయిన్మెంట్ జోన్లలోనున్న ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని తీర్చాల్సిన బాధ్యత గ్రామ వలంటీర్లపై ఉందని ఆయన స్పష్టం చేశారు.
కంటెయిన్మెంట్ జోన్ లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే గణేష్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఈ వ్యవస్థ సత్ఫలితాలిస్తుందడంతో పొరుగు రాష్ట్రాల్లోనూ ఈగ్రామ వలంటీర్ వ్యవస్థను అమలు పరచాలని పలు ప్రభుత్వాలు భవిస్తున్నాయన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రజలకందిస్తున్న  సేవలు అభినందనీయమని, లాక్ డౌన్ కాలంలో సేవలందిస్తున్న ప్రతి వలంటీర్ ని వ్యక్తిగతంగా ప్రశంసిస్తున్నానన్నారు. పాత్రికేయులు కూడా కరోనా వైరస్ వ్యాప్తి నివారించేందుకు  ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలు పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు.  మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ  గ్రామ వలంటీర్లకు కేటాయించిన యాభై గృహాల పరిధి ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వారి అవసరాలు తీర్చాలన్నారు. గ్రామ వలంటీర్లకు స్థానిక స్వయం సహాయక సంఘాల సభ్యులను అనుసంధానం చేయడం జరిగిందని, గ్రామ వలంటీర్లు వారి సహకారం తీసుకోవాలన్నారు. పట్టణం సీఎం మాట్లాడుతూ లాక్ డౌన్ నిబంధనలను పట్టణంలో  సమర్థవంతంగా అమలు పరుస్తున్నామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సంచరించే వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలందరూ సహకరిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని నర్సీపట్నంలో పూర్తిస్థాయిలో అరికట్టవచ్చునని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.      

Post a Comment

0 Comments