అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తూ తీసుకొచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేయడంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. పేదలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందించాలన్న నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. కోర్టు తీర్పు కాపీ వచ్చిన తర్వాత తాము అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 81, 85 లను రద్దు చేస్తూ హైకోర్టు ప్రకటించిన అంశాలను కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు. ‘ముఖ్యమంత్రి జగన్ ఆలోచనా విధానం అందరికి తెలుసు. ఏదైనా మాట ఇస్తే ఆ మాట కోసం నిలబడతారు. బడగుబలహీనవర్గాలవారు ఉన్నతంగా చదవాలి అని సిఎం తీసుకున్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కోర్టు ఇచ్చిన తీర్పు ఒక విజయంగానో, అపజయంగానో ఎవరూ చూడకూడదు. ప్రస్తుతం వెలువడిన కోర్టు ఆదేశాలపై జడ్జిమెంట్ కాపీ చూశాక, లా డిపార్ట్ మెంట్ తో సంప్రదించి ఇంగ్లీషు మీడియం అనేది ప్రజాప్రయోజనం కోసం ఉద్దేశించింది కాబట్టి అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం.’ అని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగుమీడియం స్కూల్స్ కూడా ఏర్పాటు చేస్తామనిచెప్పామని, అయితే, ఎందుకు ఇలా జరిగిందో తమకు తెలియదన్నారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు కాదని, టీడీపీ నేతల ఆలోచన విధానం.... బడగుబలహీన వర్గాల చెంపమీద కొట్టినట్లు ఉందని అన్నారు.
0 Comments