దిల్లీ: భౌతిక దూరం పాటించే విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చేసిన సూచనలు కరోనా నియంత్రణకు సరిపడవంటూ తాజా అధ్యయనం కొత్త విషయాలను వెల్లడించింది. తుమ్మడం, దగ్గడం, చీదడం ద్వారా శరీరం నుంచి బయటకొచ్చే వైరస్... సుమారు 7-8 మీటర్ల వరకూ వ్యాప్తి చెందుతుందని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు గుర్తించారు. ఈ మహమ్మారి గాలిలో గంటల తరబడి మనుగడ సాగిస్తోందని నిర్ధరణకు వచ్చారు. 1930 నాటి పద్ధతుల ద్వారా వైరస్ ప్రయాణించే పరిధిని డబ్ల్యూహెచ్‌వో లెక్కగట్టింది. ఆ ప్రకారం... ఆరు అడుగుల దూరం పాటించడం ద్వారా కరోనా నుంచి రక్షణ పొందవచ్చని ప్రజలకు సూచించింది. ‘‘వైరస్‌లు ప్రయాణించే తీరు భిన్నంగా ఉంటోంది. దగ్గడం, చీదడం ద్వారా శరీరం నుంచి వెలువడే తుంపరలతో పాటే వైరస్ బయటకు వస్తుంది. అయితే ఇక్కడ రెండు అంశాలుంటాయి. 1) పెద్ద పరిమాణంలో ఉండే తుంపర. రోగులకు అత్యంత దగ్గర ఉండేవారికి వీటిలో ఉండే వైరస్‌తో ముప్పు ఉంటుంది. 2) చిన్న పరిమాణంలో ఉండే తేలికపాటి తుంపరలు గాలిలో సుమారు 23-27 అడుగులు (7-8 మీటర్ల) దూరం ప్రయాణించి ఏదైనా ఉపరితలంపై నిలుస్తాయి. ఆ ప్రకారం చూస్తే, ఆరు అడుగుల దూరం కరోనా వైరస్ సోకకుండా అడ్డుకోలేదు’’ అని పరిశోధనకర్త లిడియా బోరిబా వివరించారు.
0 Comments