స్థానిక ఏరియా ఆస్పత్రిలో కోవిడ్-19 పరీక్ష కేంద్రం అందుబాటులోకి వచ్చింది. గురువారం సాయంత్రం నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే..నర్సీపట్నంలో రెండు కరోనా వైరస్ పాజిటివ్ లు రావడంతో పట్టణం పరిధి లో 23, 24, 25 వార్డులను కంటయింమెంట్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ పరీక్షలను విస్తృతంగా నిర్వహించాలన్న లక్ష్యంతో పలు ఆసుపత్రులకు ల్యాబ్ లను సమకూర్చింది. ఈ మేరకు గ్రామీణ జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం ఆస్పత్రుల్లో ల్యాబ్ లను వైద్య ఆరోగ్య శాఖ అధికారులుఏర్పాటు చేశారు. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కోవిడ్-19 పరీక్ష కేంద్రాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించి వినియోగంలోకి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నం పరిధిలోనున్న ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు నిర్వహించేందుకు అనువుగా ప్రభుత్వం ఈ ల్యాబ్ ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ల్యాబ్ లో మూడు పరికరాలు అందుబాటులో ఉన్నాయని, ఒక నమూనా పరీక్షించేందుకు గంట సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో ప్రతిరోజు 50 పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. తొలుత నర్సీపట్నంలో కంటయింమెంట్ జోన్ గా ప్రకటించిన ప్రాంత ప్రజలకు, ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులకు ఇతర సిబ్బందికి పరీక్షలు నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ఏరియా ఆసుపత్రి పరీక్ష కేంద్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ వస్తే నమూనాను కేజీహెచ్ కి పంపించి మరోసారి పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు.
కేజీహెచ్ లోను పాజిటివ్ వస్తే అధికారిగా ధ్రువీకరించడం జరుగుతుందన్నారు. సామర్థ్యం బట్టి ఒక్కొక్క పీహెచ్ సి పరిధిలో రోజుకి ఐదుగురు చొప్పున ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. నియోజకవర్గం ప్రజలు ఏ ఒక్కరూ కరోనా వైరస్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు అధికారులకు, పోలీసులకు పూర్తి సహకారం అందించాలన్నారు. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వం పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి వసుంధర మాట్లాడుతూ నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, టెక్నీషియన్స్ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ల్యాబ్ లో తొలుత కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇంటింటికీ సర్వేలను గుర్తించబడిన వ్యక్తులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. వ్యాధి లక్షణాలు తీవ్రత గా ఉన్న వ్యక్తుల నమూనాలను నేరుగా కేజీహెచ్ కి పంపించి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నీలవేణి , ఆస్పత్రి వైద్య బృందం, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
0 Comments