అమరావతి, ఏప్రిల్ 2(రాత్రి): ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్కరోజే ఇప్పటి వరకు 32 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ బులెటిన్ విడుదల చేశారు. ఈరోజు ఉదయం 21 కేసులు పాజిటివ్‌గా తేలాయి. ఆ తర్వాత 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 123 శాంపిల్స్‌ను పరీక్షించగా మధ్యాహ్నం 3 కేసులు, సాయంత్రం 8 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయని బులెటిన్‌లో ఆయన పేర్కొన్నారు. మిగతా 112 శాంపిల్స్ నెగటివ్‌గా తేలినట్లు చెప్పారు. ఈరోజు కృష్ణా జిల్లాలో 8, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదైనట్లు శ్రీకాంత్ తెలిపారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 143కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షలకు మరో రెండు ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటి వరకు 4 మాత్రమే ఉండగా తాజాగా రెండు ల్యాబ్‌లు కేటాయించింది. వీటిని గుంటూరు, కడపలోనూ ఏర్పాటు చేయనున్నారు.
0 Comments