ఏపీలో 132కు చేరిన కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను వెల్లడిస్తూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గురువారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 21 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 20 చొప్పున, ప్రకాశం జిల్లాలో 17, కడప, కృష్ణా జిల్లాల్లో 15 చొప్పున , పశ్చిమగోదావరి జిల్లాలో 14, విశాఖ జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 8, తూర్పుగోదావరి జిల్లాలో 9 అనంతపురంజిల్లాలో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1800 మంది నమూనాలు  పరీక్షించగా.. 1175 మందికి నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. 493 మంది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

 గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. పట్టణంలోని టిప్పర్ల బజార్‌లో ఓ వ్యక్తి(65)కి కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో అతని నివాసం నుంచి 3కి.మీల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు  పురపాలక కమిషనర్‌ తెలిపారు. కరోనా పాజిటివ్‌ కేసుతో సమీపంలోని దుకాణాలు, కూరగాయల మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు విధించి ఎవరినీ బయటకు రానివ్వడం లేదు. ఆ ప్రాంతమంతా హైఅలర్ట్‌ ప్రకటించామని కమిషనర్‌ వెల్లడించారు. దిల్లీలో జరిగిన మతపరమైన సమావేశానికి హాజరై వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారి వల్లే కేసులు ఇంత భారీగా పెరిగినట్లు అధికారిక సమాచారం. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగినవారూ వీరిలో ఉన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి వ్యాధి నిర్ధారణ అయింది.

Post a Comment

0 Comments