సొంత కార్యకర్తలను కాదనుకోవడం వైకాపా దౌర్భాగ్యం-జనసేన మండలాధ్యక్షుడు బుజ్జిబాబు

వైకాపా నేతల తీరుపై జనసేన మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు ధ్వజం
అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 19 (సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్) :

ఏజెన్సీలో జనసేనలోకి వస్తున్న వలసలను చూసి ఓర్వలేకనే వైకాపా నేతలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు వంతల బుజ్జిబాబు అన్నారు. ఇటీవల జనసేనలో చేరిన వారు తమ కార్యకర్తలు కారంటూ వైకాపా నేతలు పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కన్న పిల్లలు ఎవరో తల్లిదండ్రులకు తెలుస్తుందని, కానీ వారే మా పిల్లలు కారని చెబితే ఆ పరిస్థితి ఎంత దౌర్భాగ్యమో.. ఇప్పుడు వైకాపా స్థానిక నేతల తీరు కూడా అలాగే ఉందని ఎద్దేవా చేశారు. వైకాపా అసమర్థ నాయకత్వం, దౌర్భాగ్యపు పాలన చూసి విసుగుచెందే బలపం పంచాయతీ పరిధిలోని రాళ్లగెడ్డ, కప్పగొంది, మూల కొత్తూరు గ్రామాలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీకి విముక్తి పలికి జనసేనలో చేరారని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్ల వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎలా నాశనమైందో ప్రజలందరికీ తెలుసని, అందుకే సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి బ్రహ్మరథం పట్టారని బుజ్జిబాబు గుర్తుచేశారు. నాడు వైకాపా ప్రభుత్వ హయాంలో సర్పంచులకు ఇచ్చిన నిధులను సైతం వెనక్కి లాగేసుకుని, వారిని రోడ్డున పడేసి భిక్షాటన చేసే స్థాయికి దిగజార్చిన విషయం వైకాపా నేతలు అప్పుడే మర్చిపోయారా? అని నిలదీశారు. అలాంటి నాయకులకు జనసేన గురించి, పార్టీలో చేరే వారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే పంచాయతీరాజ్ శాఖ మంత్రి హోదాలో పవన్ కల్యాణ్ పంచాయతీలకు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఆ నిధులతో వైకాపా సర్పంచులు, ఎంపీటీసీలు తమ గ్రామాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధి చేశారో గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి మభ్యపెట్టాలని చూస్తున్న వైకాపాకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. వైకాపా నాయకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు ఇక నమ్మే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి విజయకేతనం ఎగురవేయడం ఖాయమని బుజ్జిబాబు ధీమా వ్యక్తం చేశారు.

Post a Comment

0 Comments