వలసలను చూసి ఓర్వలేకనే వైకాపా నేతల ఆరోపణలు

వైకాపా నాయకుల ఆరోపణలపై జనసేన నాయకుల మండిపాటు 
400 మంది చేరిక వాస్తవమేనని స్పష్టీకరణ

అల్లూరి జిల్లా, చింతపల్లి, సెప్టెంబర్ 19 (సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్) :
జనసేన పార్టీలోకి వైకాపా శ్రేణులు భారీగా తరలివస్తుండటాన్ని ఆ పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని జనసేన మండల నాయకులు పాంగి లింగారావు, కొర్ర రంగారావు, సింధేరి చిన్నయ్య, వంతల గంగరాజు, సింహాద్రి విమర్శించారు. జనసేనలో చేరిన వారు తమ కార్యకర్తలు కారంటూ బలపం పంచాయతీ ఎంపీటీసీ బచ్చలి మచ్చమ్మ, మాజీ సర్పంచ్ కొర్ర రమేష్ నాయుడు పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇవ్వడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ వైకాపా నేతల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ఎంపీటీసీ, సర్పంచ్ పదవులు వారు ఎలా పొందారో పంచాయతీ ప్రజలందరికీ తెలుసని, ఆ విషయం మర్చిపోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారని జనసేన నేతలు ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తమ బంధువులు సాయుధ మావోయిస్టులుగా ఉన్నారని చెప్పి, ఆ పేరుతో జులుం ప్రదర్శించి ప్రత్యర్థులను భయబ్రాంతులకు గురిచేసిన వాస్తవం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎవరినీ నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుని, పదవులు దక్కించుకున్నారని ఆరోపించారు. పదవిలో ఉన్నన్నాళ్లు వార్డు మెంబర్లకు కనీస విలువ ఇవ్వలేదని, ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను లెక్కచేయలేదని మండిపడ్డారు. గ్రామాల్లో ఏమేరకు నిధులు వెచ్చించారో కనీసం వార్డు మెంబర్లకు ఎందుకు చెప్పలేదో సమాధానం చెప్పాలన్నారు. నాడు 'గడప గడపకు' కార్యక్రమంలో ప్రజల సమస్యలపై జనసేన తరఫున అర్జీలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే, వాటిని ఎందుకు స్వీకరించలేదని నిలదీశారు. జనసేనలో చేరింది కేవలం 30 మంది కాదని, రాళ్లగడ్డ, జోహార్, ఆర్.జి.కొత్తూరు, మూల కొత్తూరు, కప్పగొంది, కృష్ణవరం, బలపం తూరు మామిడి, బూరుగు బయలు, దిగువ వలసపల్లి తదితర గ్రామాల నుంచి సుమారు 400 మందికి పైగా వైకాపాను వీడి తమ పార్టీలో చేరారని స్పష్టం చేశారు. జనసేన కండువా కప్పుకున్న వారిలో 7వ వార్డు సభ్యుడు సీదరి సోమరాజు, 12వ వార్డు సభ్యుడు పాంగి రంగారావులు వైకాపా నుంచి గెలిచిన వారు కాదా? అని నిలదీశారు. పార్టీలో చేరిన వారందరి జాబితా తమ వద్ద ఉందని, ఎలాంటి ఆధారాలు లేకుండా తాము పత్రికా ప్రకటనలు ఇవ్వబోమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలిచే ప్రసక్తే లేదని తాము జనసైనికులుగా సవాల్ విసురుతున్నామన్నారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు గణేష్, పి.రమణ, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments