సాయినగర్‌కు 'విద్యుత్ గ్రహణం' వీడేనా..?

ఊరంతా వెలుగులు.. ఇక్కడ మాత్రం కారుచీకట్లు 
ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని వైనం

సాంకేతిక సమస్యల పరిష్కారంలో అధికారుల వైఫల్యం 

తీవ్ర ఇక్కట్లలో కాలనీవాసులు

అల్లూరి జిల్లా, చింతపల్లి సెప్టెంబర్ 20 (సురేష్ కుమార్ పాడేరు స్టాఫ్ రిపోర్టర్) : ఊరంతా విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతుంటే.. ఆ ఒక్క కాలనీ మాత్రం కారుచీకట్లలో మగ్గుతోంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, తరచూ తలెత్తుతున్న సాంకేతిక లోపాలతో సాయినగర్ వాసులు అంధకారంలో బతుకీడుస్తున్నారు. అసలు కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని అయోమయ స్థితిలో స్థానికులు కాలం వెళ్లదీస్తున్నారు. గత కొద్ది రోజులుగా చింతపల్లి మేజర్ పంచాయతీ పరిధిలోని సాయినగర్‌ను విద్యుత్ సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఇక్కడ కరెంటు కోతలకు ఎలాంటి సమయపాలన ఉండదు. ఉదయం విద్యుత్ సరఫరా నిలిచిపోతే.. తిరిగి రాత్రి వరకు రావడం లేదు. ఒకవేళ రాత్రి పూట పోతే.. తెల్లవారే సరికి కానీ కరెంటు దర్శనమివ్వదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పగలు, రాత్రి అనే తేడా లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నా.. సాయినగర్‌కు వచ్చే సరికి ఈ పక్షపాతం ఏమిటని స్థానికులు మండిపడుతున్నారు. గంటల కొద్దీ కరెంటు లేకపోవడంతో సాయినగర్ వాసుల దినచర్య నరకప్రాయంగా మారింది. రాత్రి పూట విద్యుత్ లేక ఉక్కపోత, దోమల బెడదతో చిన్నారులు, వృద్ధులు, బాలింతలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు విద్యార్థుల చదువులకు ఆటంకం కలగడమే కాకుండా.. తాగునీటి మోటార్లు పనిచేయక గృహిణులు నిత్యం నానా తంటాలు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాల్సిన విద్యుత్ శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరెంటు పోయిన ప్రతిసారీ ఫిర్యాదులు చేస్తే.. ఏదో పైపైన మరమ్మతులు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, అసలు సాంకేతిక లోపాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపడంలో విద్యుత్ సిబ్బంది పూర్తిగా విఫలమవుతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఏమాత్రం పట్టింపు లేకపోవడం వల్లే తమకు ఈ దుస్థితి దాపురించిందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. రోజుల తరబడి కొనసాగుతున్న ఈ సమస్యతో సాయినగర్ వాసుల సహనం నశిస్తోంది. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి సాయినగర్‌లో నెలకొన్న 'విద్యుత్ గ్రహణాన్ని' వీడదీయాలని కోరుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ లైన్ల వద్ద ఉన్న సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తీరు మారకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Post a Comment

0 Comments